Telugu Global
Telangana

తెలంగాణకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏం చేశాయి?

మరో 15-20 ఏళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే తమ బతుకు బస్టాండ్‌ అవుతుందనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల భయం అన్న సీఎం

తెలంగాణకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏం చేశాయి?
X

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి కారణం కేసీఆర్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్లనే కుప్పకూలిందన్నారు. వనపర్తి సభలో ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే.. మరో 15-20 ఏళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే తమ బతుకు బస్టాండ్‌ అవుతుందనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల భయం అన్నారు. స్వయం సహాయక సంఘాల్లో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ సంఖ్యను కోటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మోడీ 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏం చేశాయి? ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? లేదా చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలి. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా ఎక్కడైనా కోతలు విధించామా? రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామా? లేదా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాం. 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సభ్యుల సంఖ్య కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. కోటి మంది ఆడబిడ్లను కోటీశ్వరులను చేయాలని కృషి చేస్తున్నామన్నారు.

పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పండబెట్టారని బీఆర్‌ఎస్‌ నేతలను సీఎం ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం రాయలసీమకు తరలించుకుంటూ పోతుంటే అందుకు కారణం కేసీఆరే అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్లనే కుప్పకూలింది. టన్నెల్‌ లో 8 మంది ప్రాణాలు పోవడానికి కారణం కేసీఆర్‌. ఆయనను నమ్మినందుకే పాలమూరు పడావు పడింది. అప్పుడే నన్ను దిగు.. దిగు అని కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత అంటున్నారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే చూసి ఓర్వలేరా? కేసీఆర్‌.. మీరు ఏలడానికి పుడితే.. మేం బిచ్చమెత్తుకోవడానికి పుట్టామా? పాలమూరు ప్రజలకు తెలివితేటలు లేవా? మీ మాదిరిగా మేం చదువుకోలేదా? అని నిలదీశారు.

కిషన్‌ రెడ్డికి నాపై కడుపు మంట

మామునూరు ఎయిర్‌పోర్టు ప్రధాని మోడీ ఇచ్చారు. నేనే తెచ్చానని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెబుతున్నారు. అదే నిజమైతే.. మెట్రో రాలేదు. ఆపింది మోడీనే కదా? మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు. ఆపింది మోడీనే కాదా? రిజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తరభాగం నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. దక్షిణ భాగం ఆగిపోయింది. ఆపింది మీరే కదా? పాలమూరు రంగారెడ్డికి 60 టీఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఆపింది మీరు కదా? వస్తేనేమో ఆయన ఖాతాలో రాసుకుంటారు. రాకపోతే రేవంత్‌రెడ్డి ఏం చేయలేదంటారు. సికింద్రాబాద్‌ వరద బాధితులకు కిషన్‌ రెడ్డి ఏం చేశారు. నా కంటే చిన్నోడు రాష్ట్రానికి సీఎం అయ్యిండని ఆయనకు కడుపు మంట. మీ దగ్గర మోడీ, ఈడీ, సీబీఐ ఉండొచ్చు. ఎంతకాలం ఈడీ, సీబీఐని చూపించి బెదిరిస్తారు? మేం ఎవరికీ భయపడం. మోడీ మనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఆయన చేయాలనుకున్నా... కిషన్‌ రెడ్డి సైంధవుడిగా అడ్డుపడుతున్నారు. తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్‌ రెడ్డి బాధపడుతున్నారని సీఎం అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదస్థలికి సీఎం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదస్థలికి సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన ఆయన.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్‌ కుప్పకూలిన ఘటనలో 8 మంది సిబ్బంది సొరంగంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని కాపాడేందుకు గత తొమ్మిది రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ను 2005-2006లో ప్రారంభించారు. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తయింది. కానీ గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో గత పదేళ్లుగా టన్నెల్‌ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని.. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాం. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌కు కావాల్సిన విడి భాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకున్నాం. కానీ అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని సీఎం అన్నారు.

ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం కాదు.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. విపత్తు సమయంలో జాతీయస్థాయిలో నిపుణులైన 11 కేంద్ర సంస్థలు, ప్రైవేట్‌ ఏజెన్సీలుల 9 రోజులుగా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇప్పటివరకూ తెలియలేదు. ఈ ఆపరేషన్‌ కొలిక్కి రావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. కన్వేయర్‌ బెల్ట్‌ పాడవడటం వల్ల సిల్టు తొలిగించడానికి ఆటంకమేర్పడింది. రేపు సాయంత్రానికి కన్వేయర్‌ బెల్టు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. మట్టి తీసిన తర్వాత మిషన్‌ తొలిగించి, గల్లంతైన వారిని గుర్తించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి ప్రమాదంపై రాజకీయం చేయడం తగదు. సొరంగంలో గల్లంతైన కుటుంబాలకు అన్నిపార్టీలు అండగా ఉండాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల్లో మనుషులు, మిషన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

First Published:  2 March 2025 5:30 PM IST
Next Story