నేడు కేఆర్‌ఎంబీ ప్రత్యేక, అత్యవసర భేటీ
ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చ

కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రత్యేక, అత్యవసర సమావేశం నేడు జరగనున్నది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో సమావేశం జరగనున్నది. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ సమావేశం కానున్నారు. ప్రస్తుత ఏడాదిలో జలవనరుల్లో తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11 వరకు నాగార్జునాసాగర్‌లో 510 అడుగుల పైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉన్నది. రెండు జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జులై వరకు తాగు నీటి అవసరాలకు, వివిధ ఔట్ లెట్ల నుంచి నీటిని తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది.అటు ఏపీ ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్నదని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని నిన్న హరీశ్‌రావు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేఆర్‌ఎంబీతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. గురువారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజా పరిణామల నేపథ్యంలో ఇవాళ జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.