సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్‌లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్ భేటీ కొనసాగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు.
క్యాబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్నారు. కులగణన విషయంలో ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తామన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా? ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.