Telugu Global
Telangana

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్‌

కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌ టెస్టులు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్‌
X

శ్రీశైలం ఎడమగట్టు కాలువ ( ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్‌ కట్టర్స్‌తో కటింగ్‌ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలిగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారు.

కార్మికుల జాడ కోసం అత్యాధునిక 'గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌' (జీపీఆర్‌) టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్‌ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏమున్నదనేది పరిశీలిస్తున్నది. ఈ సాంకేతికతతో భూమి కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు. జీపీఆర్‌ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి.. అక్కడ ఉన్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్‌ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్‌ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి అకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం ఈజీ కానున్నది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బైటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్‌ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు విశ్లేషించనున్నారు.

First Published:  28 Feb 2025 11:51 AM IST
Next Story