రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చేందుకు పాలకులు కృషి చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామిక పాలన అమలులోకి వచ్చి గణతంత్ర దేశంగా ఏర్పడి 76 ఏళ్లు అవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ.. సమానత్వం.. సౌభ్రాతృత్వం.. లౌకిక వాద మౌలిక విలువలను అనుసరిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతీ ఒక్కరం ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు. పరాయి పాలనలో మగ్గిన భారత దేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని ప్రతి గడపకూ చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారమవుతమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సమాన భాగస్వామ్యం దక్కాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్నారని.. వాటిని నిజం చేసేందుకు పాలకులు కృషి చేయాలని అన్నారు. కులం మతం ప్రాంతం జెండర్ సహా ఎలాంటి వివక్ష లేకుండ అందరూ ఆత్మగౌరవంతో జీవిస్తూ సమాన హక్కులను పొందే దిశగా మన కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వర్తిద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగం పటిష్టంగా అమలు అయ్యేందుకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Previous Articleఈ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైంది : రాష్ట్రపతి ముర్ము
Next Article ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన
Keep Reading
Add A Comment