Telugu Global
Telangana

రాష్ట్ర ఆదాయంపై రేవంత్‌ వేటు!

భారీగా తగ్గిన తెలంగాణ ఆమ్దానీ.. జనవరి నాటికి 55.96 శాతమే రాబడి

రాష్ట్ర ఆదాయంపై రేవంత్‌ వేటు!
X

వాస్తవిక లెక్కలతో తాము బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నామని అసెంబ్లీలో గొప్పలకు పోయిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. తమ చర్యల మూలంగా తెలంగాణ ఆర్థిక మూలాలను ఎంతలా దెబ్బతీసిందో తేటతెల్లమైంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకు గాను జమాపద్దుల వివరాలను కాగ్‌ వెల్లడించింది. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 70 శాతం అంచనానైనా చేరుకుంటామా అనే సందేహం కలుగుతోంది. 2024 - 25 వార్షిక బడ్జెట్‌లో అన్ని రకాల ఆదాయం రూ.2,21,243.23 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. జనవరి నెలాఖరుకు ఇందులో రూ.1,23,815 కోట్లు మాత్రమే ఆమ్దానీ సమకూరింది. ఇది మొత్తం రెవెన్యూ రాబడుల అంచనాలో 55.96 శాతం మాత్రమే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 63.20 శాతం ఆదాయం సమకూరగా ఈసారి 7.24 శాతం ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ఆదాయాన్ని హైడ్రా ఎంతలా దెబ్బతీసిందో గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్ ఆదాయం రూ.18,228.28 కోట్లుగా అంచనా వేయగా జనవరి వరకు 5,821.88 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది మొత్తం అంచనాలో 31.94 శాతం మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఆదాయం 63.24 శాతంగా ఉంది. హైడ్రా పేరుతో బుల్డోజర్లను పరుగెత్తించి నిర్మించిన ఇండ్లను కూల్చేయడంతో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల కొనుగోళ్లు క్షీణించాయి. ఆ ప్రభావం రాష్ట్ర ఖజానాపై భారీ ఎత్తున పడింది.

రాష్ట్రానికి నేరుగా వచ్చిన ఆదాయంలో అప్పులదే పెద్ద పద్దుగా ఉంది. అప్పులు, ఇతర రూపాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.49,255.41 కోట్లు సమకూర్చుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించగా జనవరి నెలాఖరుకు రూ.58,586.64 కోట్ల అప్పులు తెచ్చారు. అంచనాకు మించి పది నెలల్లోనే 19 శాతం అప్పు అదనంగా తెచ్చారు. జీఎస్టీ, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ ఆదాయమే రాష్ట్ర ఖజనాకు కాస్త దన్నుగా నిలిచింది. జీఎస్టీ రూపంలో ఆదాయం రూ.58,594.91 కోట్లుగా అంచనా వేయగా జనవరి వరకు రూ.42,657.90 కోట్లు సమకూరాయి. మొత్తం అంచనాల్లో ఇది 72.80 శాతం.. నిరుటితో పోల్చితే జీఎస్టీ ఆదాయం 1.79 శాతం తక్కువగా వచ్చింది. సేల్స్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.33,449.21 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.33,449.21 కోట్లుగా అంచనా వేయగా రూ.26,725.57 కోట్ల ఆదాయం సమకూరింది. స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీస్‌ రూపంలో రూ.25,617.53 కోట్లుగా అంచనా వేయగా రూ.15,585.35 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.18,384.19 ఆదాయం వస్తుందని లెక్కగట్టగా రూ.15,336.44 కోట్లు వచ్చింది. ఇతర పన్నుల రూపంలో రూ.10,111.78 కోట్లకు గాను రూ.6,644.56 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్స్‌ వస్తాయని అంచనా వేసినా వాస్తవ రూపం దాల్చలేదు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో 21,636.15 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా 5,176.72 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనాల్లో 23.93 శాతం ఆదాయమే గ్రాంట్స్‌ రూపంలో వచ్చింది.

2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ రూపంలో ప్రభుత్వం రూ.2,20,994.81 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా వేయగా జనవరి నెలాఖరుకు రూ.1,49,866.10 కోట్లు ఖర్చు చేశారు. ఇది మొత్తం వ్యయం అంచనాలో 67.83 శాతంగా ఉంది. ఇందులో అప్పులకు వడ్డీ చెల్లించేందుకు రూ.22,056.20 కోట్లు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.35,555.87 కోట్లు, పెన్షన్లు ఇచ్చేందుకు రూ.14,153.85 కోట్లు, సబ్సిడీలకు రూ.11,303.75 కోట్లు ఖర్చు చేశారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ రూపంలో 28,311.89 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనాలో ఇది 86.46 శాతంగా ఉంది. బడ్జెట్లో రెవెన్యూ మిగులు రూ.297.42 కోట్లు ఉంటుందని అంచనా వేయగా రూ.8,758.83 కోట్ల లోటుకు చేరుకుంటుందని కాగ్‌ అంచనా వేసింది. ద్రవ్యలోటు బడ్జెట్‌లో రూ.31,525.63 కోట్లుగా అంచనా వేయగా అది కాస్త రూ.36,530.44 కోట్లకు చేరుతుందని స్పష్టం చేసింది. హైడ్రా బుల్డోజర్‌ పాలనతో రాష్ట్ర ఆమ్దానీ గణనీయంగా దెబ్బతినడంతో అప్పులు చేయడం మినహా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ముందు ఇంకో మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌ కు లోబడే రూ.58 వేల కోట్ల అప్పు చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 20 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు ఆర్‌బీఐ వద్ద ప్రయత్నిస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ పరిధిలో చేసే అప్పులే రూ.80 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కార్పొరేషన్‌ల ద్వారా తెచ్చే అప్పులు, భూములు కుదువ పెట్టి సమకూర్చుకునే ఆదాయం కూడా లెక్కలోకి తీసుకుంటే అప్పులు రూ.1.30 లక్షల కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా.


ప్రగతి పరుగులపై హైడ్రా వేటు.. కథనం చదివేందుకు లింక్‌ క్లిక్‌ చేయండి


First Published:  22 Feb 2025 1:38 PM IST
Next Story