హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట
డిసెంబర్ 24 వరకు మోహన్ బాబు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణ ఈనెల 24 వతేదీకి వాయిదా వేసింది. మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తనకు పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ... హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే నేడు విచారణకు రావాల్సింది మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.