Telugu Global
Telangana

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు

మూడు స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు
X

మూడు శాసన మండలి స్థానాలకు మరికాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండు టీచర్స్‌, ఒక గ్రాడ్యుయేట్స్‌ స్థానాలకు ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఈ మూడు స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు నిలిచారు. కరీంనగర్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - మెదక్‌ గ్రాడ్యుయేట్స్‌ స్థానం నుంచి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3,55,159 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 499 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 600 భారీ సైజు బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. కరీంనగర్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - మెదక్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 27,088 మంది ఓటర్లు ఉన్నారు. 274 పోలింగ్‌ కేంద్రాల్లో 658 బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 25,797 మంది ఓటర్లు ఉన్నారు. 200 పోలింగ్‌ కేంద్రాల్లో 480 బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను మొదట ఆయా జిల్లా కేంద్రాల్లోని డీఆర్సీ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి కరీంనగర్‌, నల్గొండలోని స్ట్రాంగ్‌ రూములకు తరలిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించి తుది ఫలితం వచ్చే వరకు ఓట్ల లెక్కింపు కొనసాగిస్తారు.

ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు సహా ఎన్నికల సంఘం గుర్తించిన మరో 12 రకాల ఐడెంటిటీ కార్డులు చూపించవచ్చు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులు ఇంగ్లిష్‌ నంబర్లలో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకటో నంబర్‌ నుంచి పోటీలో ఉన్న మొత్తం మంది అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత (1)తో పాటు ద్వితీయ (2), తృతీయ (3) ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఎమ్మెల్సీ పోలింగ్‌ నేపథ్యంలో ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఓటింగ్‌ లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత ఎమ్మెల్సీలు జీవన్‌ రెడ్డి, రఘోత్తమ్‌ రెడ్డి, నర్సిరెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. శాశ్వత సభ అయిన శాసన మండలిలో ప్రతి రెండేళ్లకోసారి మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.

First Published:  27 Feb 2025 7:15 AM IST
Next Story