రెండున్నరేళ్లలో మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తి
భద్రాద్రి ఎయిర్‌పోర్టు విషయంలో కొత్త స్థలం ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయ్యాక విమాన రంగంలో ఓ విప్లవం మొదలైంది. పదేళ్లో దేశంలోని ఎయిర్‌పోర్టుల సంఖ్య 79 నుంచి 150 కి పెరిగింది. చిన్నచిన్న నగరాల్లోనూ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేశాం. మామునూరు ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్ తన హయాంలో రావడం సంతోషంగా ఉందన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ఈ విమానాశ్రయం గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉండేది. 1981 వరకు ఇక్కడి నుంచి రాకపోకలు సాగుతుండేవి. మామునూరు ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఎయిర్‌పోర్టుకు 2800 మీటర్ల రన్‌వే అవసరం. 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అవుతాయి. భూసేకరణ పూర్తయిన రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చామన్నారు. భద్రాద్రి ఎయిర్‌పోర్టు విషయంలో కొత్త స్థలం ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.