Telugu Global
Telangana

చందన్ వెల్లిలో జపాన్ కంపెనీలు.. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా చందన్‌ వెల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో జపాన్‌ కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ యూనిట్‌, నికోమాక్‌ తైకిషా క్లీన్‌ రూమ్స్‌ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

చందన్ వెల్లిలో జపాన్ కంపెనీలు.. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
X

చందన్ వెల్లిలో జపాన్ కంపెనీలు.. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా చందన్‌ వెల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో జపాన్‌ కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ యూనిట్‌, నికోమాక్‌ తైకిషా క్లీన్‌ రూమ్స్‌ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. తయారీ రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శమని, ఆ దేశం కూడా తమ యూనిట్ ల ఏర్పాటుకి తెలంగాణను ఎంపిక చేసుకోవడం సంతోషకరమని చెప్పారు. చందన్ వెల్లి ఇండస్ట్రియల్ పార్క్ కు వెల్ స్పన్, మైక్రోసాఫ్ట్ సహా అనేక ఇతర సంస్థలు వస్తున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.


అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి నిలబడి జపాన్ దేశం తమ సత్తా చాటిందని అన్నారు మంత్రి కేటీఆర్. మన దేశంలో ప్రతి ఇంట్లో జపాన్ కి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌ లో జపాన్ కి చెందిన మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. కొద్దిపాటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న దేశం జపాన్ అని అన్నారు కేటీఆర్.

తెలంగాణలో యూనిట్ స్థాపించిన జపాన్ కంపెనీ డైఫుకు మన దేశంలో కూడా అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్. రూ.575 కోట్లు పెట్టుబడి పెడుతున్న డైఫుకు మూడు నెలల్లోనే ఇక్కడ యూనిట్ ప్రారంభిస్తుందన్నారు. భారత్‌ కు చెందిన వెగా కన్వేయర్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ కంపెనీతో కలసి డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ కంపెనీ ఎక్విప్‌ మెంట్‌ యూనిట్‌ ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. కన్వేయర్స్‌, షార్టర్స్‌ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రెండు విడతల్లో 500మందికి ఉపాధి లభిస్తుంది.

నికోమాక్‌ తైకిషా లిమిటెడ్‌ కంపెనీ నిర్మాణ రంగానికి చెందిన క్లీన్‌ రూం ఉత్పత్తులను తయారు చేస్తుంది. చందన్ వెల్లిలో రూ.126.2 కోట్లతో యూనిట్‌ ను నెలకొల్పుతోంది. గతేడాది డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు శంకుస్థాపన జరిగింది.

First Published:  14 July 2023 1:18 PM IST
Next Story