అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కార్ కొనసాగించాలి
సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో బీఆర్‌ఎస్ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కార్ కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కొనసాగాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వరస్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీ ఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆలయ అభివృద్ధికి కేసీఆర్ రూ. 250 కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రానా అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత ప్రభుత్వం ఆ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి పనులు కొనసాగించి త్వరగా పూర్తి చేయాలన్నారు.
రాజన్న సిరిసిల్ల అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందిని,నేత కార్మికుల సంక్షేమం కోసం కేటీఆర్ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువ అయ్యాయని, కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకే టీ స్టాల్ తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వమని ధ్వజమెత్తారు.