Telugu Global
Telangana

లక్క గాజులకు జీఐట్యాగ్.. వీటి ప్రత్యేకత ఏంటంటే..?

తెలంగాణ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తిగా లక్క గాజులు అరుదైన ఘనత సొంతం చేసుకున్నాయి.

లక్క గాజులకు జీఐట్యాగ్.. వీటి ప్రత్యేకత ఏంటంటే..?
X

పోచంపల్లి ఇక్కత్ చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, నిర్మల్ కొయ్యబొమ్మలు.. ఇలా తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 16 విభిన్న రకాల వస్తువులు, ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రేషన్స్‌ ట్యాగ్‌) లభించింది. ఈ లిస్ట్ లో 17వ వస్తువుగా లాడ్ బజార్ లక్కగాజులు చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఇప్పటికే హలీమ్ కి జీఐ ట్యాగ్ రాగా నగరానికి సంబంధించి లాడ్ బజార్ లక్కగాజులు కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాయి.

వీటి స్పెషాలిటీ ఏంటంటే..?

హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ వివిధ రకాల గాజుల్ని తయారు చేస్తుంటారు, అందులో లక్క రాళ్ల గాజులకు అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంది. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైందని అంటారు. రెసిన్‌ అనే పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దాన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు. చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బ్యాంగిల్స్​ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. మొఘల్ వంశస్థుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు. రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులను ఎక్కువగా ధరించేవారు. కాలక్రమేణా వీటి డిజైన్లలో ఎన్నో మార్పులు రాగా.. ప్రస్తుతం వేడుకల్లో మాత్రం ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో 6వేలకు పైగా కార్మికులు లక్కగాజుల తయారీలో భాగస్వాములుగా ఉన్నారు.

లాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ ట్యాగ్ కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దరఖాస్తు చేసింది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించడంతో వీటికి ఫైనల్ గా జీఐ ట్యాగ్ లభించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధీనంలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌ శాఖ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు మంజూరు చేసినట్టు ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ అందజేస్తారు. లక్క గాజుల కోసం ప్రత్యేక లోగో కూడా రూపొందిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తిగా లక్క గాజులు అరుదైన ఘనత సొంతం చేసుకున్నాయి.

First Published:  3 March 2024 12:35 PM IST
Next Story