Telugu Global
Telangana

సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా?
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించామని హరీశ్‌రావు తెలిపారు. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికాబద్ధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్) పంట కోతకు వచ్చింది. సన్ ఫ్లవర్ గింజలను విక్రయించడానికి ఇప్పటిదాకా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. దీనివల్ల రైతులు రూ. 5,500 నుంచి రూ. 6000 వరకు దళారులకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్న పరిస్థితి దాపురించిదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాఫెడ్ ద్వారా సన్ ఫ్లవర్ నూనె గింజలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేశాం. ఈసారి కూడా రూ. 7280 మద్దతు ధరను నాఫెడ్ ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులకు విక్రయించడం వల్ల క్వింటాల్ కు రూ. 1000 నుండి రూ. 2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి రైతులకు కలిగింది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన హరీశ్‌ డిమాండ్ చేశారు. .

మీ అలసత్వం కారణంగా తెలంగాణ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తున్నది. నూనె పంటలు వేయాలంటేనే రైతులు ఆందోళన చెందే పరిస్థితులను మీరు కల్పిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. క్షేత్రస్థాయిలో సన్ ఫ్లవర్ గింజలు పండించిన రైతుల కష్టాలను తొంగి చూడండి. రేపటి నుండే రాష్ట్రమంతటా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఆదేశించండి. ఎన్నికల కోడ్ తో రైతుల కష్టాలకు ముడి పెట్టకుండా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  2 March 2025 3:49 PM IST
Next Story