ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్
తొలి రెండు నిమిషాల వరకు వినేశ్‌కు పాయింట్ దక్కకపోయినప్పటికీ అనంతరం రెండు నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేశ్‌కు తొలి పాయింట్ లభించింది.
ఒలింపిక్స్ భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్‌కు వెళ్లిన తొలి భారత మహిళగా ఆమె ఈ ఘనత సాధించింది. మంగళవారం క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపెజ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఏకంగా 5–0 తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైనట్టయింది. ఈ ఒలింపిక్స్‌లో రిజ్లింగ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ఇక ఫైనల్‌లో వినేశ్ ఫోగట్ విజయం సాధిస్తే ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం. ఫైనల్ మ్యాచ్ బుధవారం జరగనుంది.
సెమీ ఫైనల్‌లో క్యూబా రెజ్లర్‌తో తలపడిన వినేశ్.. ఆమెను ప్రారంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టేసింది. తొలి నుంచీ ఆధిపత్యం చెలాయించి ఎక్కడా పట్టు సడలకుండా ఆడింది. తొలి రెండు నిమిషాల వరకు వినేశ్‌కు పాయింట్ దక్కకపోయినప్పటికీ అనంతరం రెండు నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేశ్‌కు తొలి పాయింట్ లభించింది. ఆ తర్వాత గేమ్‌లో ప్రత్యర్థి అటాకింగ్‌కు దిగగా.. ఈ క్రమంలో ఫోగట్ చాకచక్యంగా వ్యవహించి ఆమె కాలిని మలిచి కోలుకోనీయకుండా చేసింది. దీంతో వరుసగా రెండు పాయింట్ల చొప్పున సాధించి 5–0 తేడాతో విజయం సాధించింది.