Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ కు ముందే అమెరికా సంచలనం!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ పసికూనజట్లలో ఒకటైన అమెరికా సంచలనం సృష్టించింది. ప్రపంచ 9వ ర్యాంక్ జట్టు బంగ్లాదేశ్ పై వరుస విజయాలతో సిరీస్ ఖాయం చేసుకొంది.

టీ-20 ప్రపంచకప్ కు ముందే అమెరికా సంచలనం!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ పసికూనజట్లలో ఒకటైన అమెరికా సంచలనం సృష్టించింది. ప్రపంచ 9వ ర్యాంక్ జట్టు బంగ్లాదేశ్ పై వరుస విజయాలతో సిరీస్ ఖాయం చేసుకొంది.

స్వదేశీగడ్డపై జరిగే 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీకి పసికూన అమెరికాజట్టు సన్నాహాలను సంచలనాలతో మొదలు పెట్టింది. టీ-20 9వ ర్యాంక్ జట్టు బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ నెగ్గడం ద్వారా అమెరికా తొలి అంతర్జాతీయ సిరీస్ గెలుచుకోగలిగింది.

బంగ్లాబ్యాటర్ల బెంబేలు....

ప్రపంచకప్ కు సన్నాహకాలలో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ-20 సిరీస్ లో పసికూన అమెరికా ఒకటి కాదు..వరుసగా రెండు విజయాలతో చరిత్ర సృష్టించింది.

టెస్టు హోదా పొందిన ఓ జట్టు ప్రత్యర్థిగా మూడో విజయం, తొలి సిరీస్ గెలుపు సాధించగలిగింది.

ఎక్కువమంది భారత సంతతి ఆటగాళ్లతో కూడిన అమెరికాజట్టు కు అంతగా అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం లేకున్నా సమరోత్సాహంతో ఆడింది. ప్రయరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ లోని తొలి పోరులో 5 వికెట్ల తేడాతో నెగ్గిన అమెరికా..సిరీస్ కే కీలకంగా మారిన రెండోమ్యాచ్ లో సైతం సత్తా చాటుకొంది. 6 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది.

అంతర్జాతీయ క్రికెట్లో అమెరికాకు ఇదే తొలిసిరీస్ విజయం కావడం ఓ చరిత్రగా మిగిలిపోతుంది. ఐర్లాండ్ పై గతంలో తొలి గెలుపు నమోదు చేసిన అమెరికా..టెస్టు హోదా పొందిన బంగ్లాదేశ్ పైన సైతం బ్యాట్ కు బ్యాక్ విజయాలతో సత్తా చాటుకొంది.

చేజింగ్ లో బంగ్లా ఫ్లాప్..

సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో ముందుగా ఫీల్డింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆతిథ్య అమెరికాజట్టును 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగుల స్కోరుకు కట్టడి చేయగలిగింది.

అమెరికా బ్యాటర్లలో కెప్టెన్ మోనాంక్ పటేల్ 42, ఆరోన్ జోన్స్ 35 పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో రషీద్ హుస్సేన్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేయాల్సిన బంగ్లా జట్టు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నజ్ముల్ హుస్సేన్ శాంటో 36, మాజీ కెప్టెన్ షకీబుల్ హుస్సేన్ 30 పరుగులతో పోరాడినా ప్రయోజనం లేకపోయింది.

అమెరికా బౌలర్లలో అలీఖాన్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు, పేసర్ సౌరవ్ నేత్రవల్కర్ 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఆఖరి 3 ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన బంగ్లాజట్టును అమెరికా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఆఖరి 6 బంతుల్లో 12 పరుగులు చేసే పరిస్థితి ఉన్నా బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు.

జూన్ 2 నుంచి మూడువారాలపాటు జరుగనున్న టీ-20 ప్రపంచకప్ కు వెస్టిండీస్ తో పాటు అమెరికా సైతం సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. న్యూయార్క్, ఫ్లారిడా నగరాలు వేదికలుగా ప్రపంచకప్ లోని పలు లీగ్ దశ మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

ఆతిథ్య దేశం హోదాలో తొలిసారిగా ప్రపంచకప్ బరిలో నిలిచిన అమెరికా...గ్రూపు-ఏ లీగ్ లో భాగంగా టాప్ ర్యాంకర్ భారత్, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్ జట్లతో తలపడనుంది.

మొత్తం మీద..ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే టెస్ట్ హోదా పొందిన ఓ జట్టుపైన సిరీస్ నెగ్గడం ద్వారా అమెరికా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టగలిగింది.

First Published:  24 May 2024 2:30 PM IST
Next Story