Telugu Global
Sports

దక్షిణాఫ్రికాగడ్డపై రోహిత్ కు జంటరికార్డుల ఛాన్స్ !

సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించే అవకాశం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు ఉంది. కేప్ టౌన్ వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే ఆఖరిటెస్టులో భారత్ నెగ్గితే రెండు రికార్డులు సొంతమవుతాయి.

దక్షిణాఫ్రికాగడ్డపై రోహిత్ కు జంటరికార్డుల ఛాన్స్ !
X

సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించే అవకాశం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు ఉంది. కేప్ టౌన్ వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే ఆఖరిటెస్టులో భారత్ నెగ్గితే రెండు రికార్డులు సొంతమవుతాయి.

దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీజట్టును ఓడించడం ద్వారా గత మూడుదశాబ్దాల కాలంలో తొలిటెస్టు సిరీస్ నెగ్గే అవకాశాన్ని ఇప్పటికే చేజార్చుకొన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోసం మరో రెండు అరుదైన ఘనతలు ఎదురుచూస్తున్నాయి.

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులో భారత్ నెగ్గితే చాలు..రెండు అరుదైన రికార్డులు సొంతమవుతాయి.

గత 8 సిరీస్ ల్లోనూ...

1992-93 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తూ టెస్టు సిరీస్ లు ఆడుతూ వస్తున్న భారత్ ఇప్పటి వరకూ ఒక్కసారీ సిరీస్ విజేతగా నిలువలేకపోయింది. గత మూడు దశాబ్దాల కాలంలో సఫారీగడ్డపై నాలుగంటే నాలుగు టెస్టుమ్యాచ్ ల్లో మాత్రమే భారత్ విజేతగా నిలిచింది. ఇందులో రెండుటెస్టులు జోహెన్స్ బర్గ్ న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా రెండు విజయాలు ఉన్నాయి.

ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి టెస్టుకు వేదికగా ఉన్న కేప్ టౌన్ న్యూలాండ్స్ స్టేడియంలో ఇప్పటి వరకూ భారత్ ఆరుటెస్టులు ఆడినా 2 డ్రాలు, 4 పరాజయాల రికార్డుతో మిగిలింది.

న్యూలాండ్స్ వేదికగా 7వసారి టెస్టు బరిలోకి దిగుతున్న భారత్ విజయం సాధించగలిగితే కేప్ టౌన్ వేదికగా తొలిగెలుపు నమోదు చేసినట్లవుతుంది. సిరీస్ ను 1-1తో డ్రా చేసిన రికార్డు సైతం భారత్ కు దక్కుతుంది.

గతంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే భారతజట్టు టెస్టు సిరీస్ ను డ్రాగా ముగించగలిగింది. ప్రస్తుత సిరీస్ ను సైతం భారత్ డ్రాగా ముగించగలిగితే ధోనీ సరసన రోహిత్ శర్మకు చోటు దక్కుతుంది.

భారత అత్యధిక స్కోరు 414 పరుగులు...

కేప్ టౌన్ న్యూలాండ్స్ స్టేడియంలో భారత్ అత్యధికంగా 2007 సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో 414 పరుగుల భారీస్కోరు సాధించింది. 2018 సిరీస్ లో భాగంగా ఆడిన టెస్టులో అత్యల్పంగా 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కేప్ టౌన్ వేదికగా ఆడిన 4 టెస్టులు, 7 ఇన్నింగ్స్ లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 489 పరుగులు సాధించాడు. 1997 సిరీస్ లో భాగంగా ఆడిన టెస్టులో మాస్టర్ సచిన్ అత్యధికంగా 254 బంతులు ఎదుర్కొని 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించగలిగాడు.

కేప్ టౌన్ వేదికగా 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల రికార్డు సైతం సచిన్ పేరుతోనే ఉంది.

న్యూలాండ్స్ లో అత్యధికంగా 4 సిక్సర్లు బాదిన ఘనత రిషభ్ పంత్ కు మాత్రమే దక్కుతుంది. అత్యధికంగా 12 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డును జవగళ్ శ్రీనాథ్ సాధించాడు.

ఐదేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లుగా హర్భజన్ సింగ్, శ్రీశాంత్, జస్ ప్రీత్ బుమ్రా, అత్యధికంగా 5 క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ గా చతేశ్వర్ పూజారా నిలిచారు.

న్యూలాండ్స్ వేదికగా 1997 సిరీస్ లో సచిన్ టెండుల్కర్- మహ్మద్ అజరుద్దీన్ 6వ వికెట్ కు 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

కేప్ టౌన్ వేదికగా అత్యధికంగా 4 టెస్టులు ఆడిన ఘనత మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే ఉంది.

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో తేలిపోయిన భారత్..ఈ ఆఖరి టెస్టులో స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే సఫారీజట్టుకు గట్టిపోటీ తప్పదు.

First Published:  3 Jan 2024 6:03 AM GMT
Next Story