Telugu Global
Sports

సిక్సర్ల బాదుడులో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు!

2024- టీ-20 ప్రపంచకప్ ను భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ జంట రికార్డులతో మొదలు పెట్టాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినంత పని చేశాడు.

సిక్సర్ల బాదుడులో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు!
X

భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సిక్సర్లబాదుడులో తనకు తానే సాటిగా నిలిచాడు.

2024- టీ-20 ప్రపంచకప్ ను భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ జంట రికార్డులతో మొదలు పెట్టాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినంత పని చేశాడు.

అమెరికాలోని న్యూయార్క్ నసావు కౌంటీ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్ లీగ్ తొలిమ్యాచ్ ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు.

ధోనీని మించిన రోహిత్...

భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. ఐర్లాండ్ తో జరిగిన పోరులో రోహిత్ అజేయ హాఫ్ సెంచరీతో తన జట్టుకు 8 వికెట్ల విజయం అందించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ ధోనీపేరుతో ఉన్న 41 విజయాల రికార్డును రోహిత్ 42వ విజయంతో తెరమరుగు చేశాడు. భారత కెప్టెన్ గా ధోనీ 73 టీ-20 మ్యాచ్ ల్లో 41 విజయాలు సాధిస్తే..రోహిత్ మాత్రం కేవలం 55 మ్యాచ్ ల్లోనే తనజట్టుకు 42 విజయాలు అందించడం విశేషం.

కెప్టెన్ గా ధోనీ విజయశాతం 59.28గా ఉంటే...రోహిత్ 77.29 విజయశాతం నమోదు చేశాడు. విరాట్ కొహ్లీ 50 టీ-20 మ్యాచ్ ల్లో భారత్ కు 30 విజయాలు అందించడం ద్వారా 60 శాతం విజయాలతో రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

టీ-20 చరిత్రలోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ రికార్డు పాక్ సారథి బాబర్ అజమ్ పేరుతో ఉంది. బాబర్ 81 మ్యాచ్ ల్లో పాక్ కు 46 విజయాలు అందించాడు.

42వ విజయంతో రోహిత్ శర్మ..మరో ఇద్దరు (వోయిన్ మోర్గాన్, అస్ఘర్ అఫ్ఘాన్ ) కెప్టెన్లతో కలసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

సిక్సర్ల బాదుడులో హిట్ మ్యాన్ టాప్....

ఐర్లాండ్ పై 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ సిక్సర్ల బాదుడులో తన ప్రపంచ రికార్డును తానే అధిగమించగలిగాడు.600 సిక్సర్లు సాధించిన ఏకైక, తొలి క్రికెటర్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్రలోనూ కలిపి రోహిత్ సాధించిన సిక్సర్ల సంఖ్య 600కు చేరింది. కరీబియన్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ-20 ప్రపంచకప్ లో 1000 పరుగుల రికార్డు...

2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ తో తన పరుగుల వేట ప్రారంభించిన రోహిత్ 1000 పరుగుల మైలురాయిని ప్రస్తుత 9వ టీ-20 ప్రపంచకప్ లీగ్ తొలిమ్యాచ్ ద్వారా చేరుకోగలిగాడు.

37 సంవత్సరాల రోహిత్ ఈ క్రమంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోను 4వేల పరుగులు చొప్పున సాధించిన భారత రెండో బ్యాటర్ గా నిలిచాడు. సాంప్రదాయ టెస్టు, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో 4వేల పరుగులు చొప్పున సాధించిన భారత తొలి బ్యాటర్ రికార్డు విరాట్ కొహ్లీ పేరుతో ఉంది.

టీ-20 ఫార్మాట్లలో ప్రస్తుత ఐర్లాండ్ పోరు వరకూ 144 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 4026 పరుగులు సాధించాడు. ఐదు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో 32.20 సగటు, 139. 98 స్ట్ర్రయిక్ రేటుతో అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 4137 పరుగులు, వన్డే క్రికెట్లో 10వేల 709 పరుగులు సాధించాడు.

భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ టెస్టుల్లో 8848 పరుగులు, వన్డేల్లో 13ేల 848 పరుగులు, టీ-20ల్లో 4038 పరుగులు సాధించాడు.

టీ-20 ప్రపంచకప్ లో రోహిత్ ఇప్పటి వరకూ 40 మ్యాచ్ లు ఆడి 37 ఇన్నింగ్స్ లో 1015 పరుగులు సాధించాడు. 36.25 సగటుతో 128. 48 స్ట్ర్రయిక్ రేటుతో...ఈ ధూమ్ ధామ్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో మూడవస్థానంలో నిలిచాడు.

First Published:  6 Jun 2024 8:45 AM GMT
Next Story