Telugu Global
Sports

ఒలింపిక్స్ లో భారత్ కు' డబుల్ గోల్డ్' చాన్స్!

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి. మహిళల కుస్తీ ఫైనల్స్ కు చేరడం ద్వారా వినేశ్ పోగట్ నాలుగో పతకం ఖాయం చేసింది.

ఒలింపిక్స్ లో భారత్ కు డబుల్ గోల్డ్ చాన్స్!
X

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి. మహిళల కుస్తీ ఫైనల్స్ కు చేరడం ద్వారా వినేశ్ పోగట్ నాలుగో పతకం ఖాయం చేసింది.

పారిస్ ఒలింపిక్స్ మొదటి 10 రోజుల్లో కేవలం 3 కాంస్య పతకాలు మాత్రమే సాధించిన భారత్ ను..ఆఖరి నాలుగురోజుల్లో రెండు స్వర్ణాలు ఊరిస్తున్నాయి. పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా, మహిళల కుస్తీ 50 కిలోల ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరటంతో జంట బంగారు పతకాలు సాధించే అవకాశం మెరుగయ్యింది.

పురుషుల హాకీ ఫైనల్స్ కు 1980 తరువాత చేరాలన్నభారత ఆశలకు జర్మనీ సెమీఫైనల్స్ లోనే గండి కొట్టింది.

కుస్తీ బరిలో వినేశ్ సంచలనం...

ఒలింపిక్స్ మహిళల కుస్తీ చరిత్రలో బంగారు పతకం రౌండ్ చేరిన తొలి భారత వస్తాదు ఘనతను వినేశ్ పోగట్ సొంతం చేసుకొంది. ప్రతికూల పరిస్థితులను మొక్కవోని దీక్షతో అధిగమించి వరుసగా రెండు సంచలన విజయాలతో వినేశ్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ సుసాకీ పై 3-2తో సంచలన విజయం సాధించిన వినేశ్...సెమీఫైనల్లో క్యూబా వస్తాదును 5-0తో చిత్తు చేసి టైటిల్ రౌండ్లో అడుగుపెట్టింది.

ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో క్యూబాకు చెందిన యుసెనీలిస్ గుజ్ మాన్ ను అలవోకగా ఓడించడం ద్వారా ప్రస్తుత క్రీడల్లో భారత్ కు నాలుగో పతకం ఖాయం చేసింది.

2016 రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన భారత తొలి మహిళా వస్తాదుగా నిలిస్తే..తొలి రజత లేదా బంగారు పతకం నెగ్గిన మహిళగా వినేశ్ రికార్డుల్లో చేరనుంది.

ఒకేరోజున ముగ్గురు వస్తాదులను మట్టి కరిపించిన వినేశ్ బంగారు పతకం కోసం అమెరికా వస్తాదుతో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రీ- క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ యు సుసాకీని, క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ వస్తాదు ఒక్సానా లివాచ్ ను, సెమీఫైనల్లో క్యూబన్ వస్తాదు గుజ్మాన్ ను వినేశ్ అధిగమించగలిగింది.

భారత్ జైత్రయాత్రకు జర్మనీ బ్రేక్...

పురుషుల హాకీ సెమీస్ లోనే మాజీ చాంపియన్ భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రూపులీగ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ 2-3 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓటమిచవిచూసి..కాంస్య పతకం పోరులో మిగిలింది.

హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలిగోలు భారత్ సాధించినా..ఆఖరి రెండుక్వార్టర్లలో జర్మనీ పైచేయి సాధించింది. రెండుజట్లు చెరో రెండు గోల్స్ సాధించి 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన తరుణంలో ఆట ఆఖరి 7వ నిముషంలో జర్మనీ గోలు చేయడం ద్వారా 3-2 విజయంతో ఫైనల్స్ చేరుకోగలిగింది.

1980 మాస్కో ఒలింపిక్స్ తరువాత తొలిసారిగా ఫైనల్స్ చేరాలన్న భారత ఆశలు సెమీస్ ఓటమితో అడియాసలయ్యాయి.

కాంస్య పతకం కోసం జరిగే పోరులో స్పెయిన్ తో భారత్, బంగారు పతకం పోరులో నెదర్లాండ్స్ తో జర్మనీ తలపడనున్నాయి.

వరుసగా రెండోగేమ్స్ ఫైనల్లో నీరజ్ చోప్రా...

ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో ఒకటైన జావలిన్ త్రో లో భారత స్టార్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా..వరుసగా రెండో స్వర్ణానికి గురి పెట్టాడు.

పారిస్ ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం వేదికగా జరిగిన జావలిన్ త్రో గ్రూప్-బి క్వాలిఫైయింగ్ రౌండ్లో నీరజ్ 89.34మీటర్ల దూరం బల్లెం విసరడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగు పెట్టాడు.

నీరజ్ రికార్డు త్రో...

జావలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్లలో మొత్తం 32 మంది ప్రపంచ మేటి బల్లెం వీరులు తలపడ్డారు. వివిధ దేశాల అథ్లెట్లను రెండు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించారు. భారత్ తరపున బరిలో నిలిచిన ఇద్దరిలో కిశోర్ కుమార్ జెనా గ్రూప్- ఏ నుంచి పోటీకి దిగి ఫైనల్స్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. జెనా 80.21 మీటర్ల తో ఒలింపిక్స్ నుంచి నిష్క్ర్రమించాడు.

మెడల్ రౌండ్ కు అర్హతగా 84 మీటర్లుగా లక్ష్యాన్ని నిర్ణయించారు. గ్రూప్- బీ నుంచి పోటీకి దిగిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే అర్హతకు నిర్దేశించిన లక్ష్యం కంటే 5.34 మీటర్ల దూరం ఎక్కువగా విసరడం ద్వారా ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకోగలిగాడు. ప్రస్తుత సీజన్లో నీరజ్ సాధించిన అత్యుత్తమ రికార్డు ఇదే కావటం విశేషం. టోక్యో ఒలింపిక్స్ తరువాత 15 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొన్న నీరజ్ రెండుసార్లు మాత్రమే 85 మీటర్లకు పైగా బల్లెం విసరగలిగాడు. అయితే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ రౌండ్లోనే రికార్డు స్థాయిలో 89. 34 మీటర్ల రికార్డు నెలకొల్పాడు. నీరజ్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ రికార్డు కావడం విశేషం.

ఒక్కో గ్రూపు నుంచి 16 మంది తలపడగా..మొదటి ఆరుస్థానాలలో నిలిచిన 12 మంది స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్ రౌండ్లో పోటీపడనున్నారు.

జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ స్టార్ యాకుబ్ వాడ్లిచ్, కెన్యాకు చెందిన జూలియస్ యోగో, పీటర్స్ నుంచి నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఎదురుకానుంది.

పతకాల పట్టిక 63వ స్థానంలో భారత్...

పారిస్ ఒలింపిక్స్ 11వ రోజు పోటీలు ముగిసే సమయానికి 3 కాంస్యాలతో భారత్ పతకాల పట్టిక 67వ స్థానానికి పడిపోయింది. షూటింగ్ లో సాధించిన మూడు పతకాలే భారత్ ను ఇప్పటి వరకూ పతకాల పట్టికలో నిలుపుతూ వచ్చాయి.

అమెరికా 86, చైనా 59, ఆస్ట్ర్రేలియా 35, ఆతిథ్య ఫ్రాన్స్ 48, గ్రేట్ బ్రిటన్ 46 పతకాలతో మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి. అమెరికా 24, చైనా 22 బంగారు పతకాలు సాధించాయి.

రానున్న రెండురోజుల్లో నీరజ్ చోప్రా, వినేశ్ పోగట్ స్వర్ణాలు సాధించగలిగితే భారత్ పతకాల పట్టిక మొదటి 30 స్థానాలలో నిలిచే అవకాశం ఉంది.

First Published:  7 Aug 2024 12:17 PM IST
Next Story