మరికొద్దిసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీలోనే హైవోల్టేజ్ మ్యాచ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉండబోతున్నదంటే?

దుబాయ్ వేదికగా మరికొద్దిసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీలోనే హైవోల్టేజ్ మ్యాచ్ మొదలుకానున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. దాయాది జట్టుకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన పోరు. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌కు బెర్త్ ఖరారు చేసుకోవాలని భారత్ చూస్తున్నది. ఈ మైదానంలో భారత్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింట విజయం సాధించడం గమనార్హం. దుబాయ్‌ఇంటర్నేషనల్ మైదానంలో మొత్తం 59 మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 మాత్రమే గెలిచింది. ఒకటి ఫలితం తేలలేదు. మరొకటి టైగా ముగిసింది.
ఈ మైదానం బౌలర్లకు కొంత అనుకూలంగా ఉంటుంది. 59 మ్యాచ్ ల్లో నాలుగుసార్లు మాత్రమే 300+ స్కోర్లు నమోదయ్యాయి. చివరిసారిగా పాక్ 2019లో 300+ చేసింది. ఇక ఈ పిచ్‌పై తొలి మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు పరుగులకు అవస్థలుపడ్డారు. 228 రన్స్ ఛేజింగ్ కోసం భారత్ 47 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు కొంత వెసులుబాటు లభిస్తుంది. తొలి ఇన్నింగ్స్ బ్యాటర్ల సగటు 25 కాగాఆ. రెండో ఇన్సింగ్స్‌లో 29గా ఉన్నది. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ఈ వేదిక స్పిన్నర్ల కంటే సీమర్లకే ఎక్కువగా సహకరిస్తుందని రికార్డులు చెబుతున్నాయి. 59 మ్యాచ్‌ల్లో పేసర్లు 28 సగటు, 4.79 ఎకానమీతో 473 వికెట్లు సాధించారు. స్పిన్నర్లు 30 సగటు, 4.25 ఎకానమీతో 325 వికెట్లను పడగొట్టారు. గత మ్యాచ్‌లో పేసర్లే 10 వికెట్లు కూల్చిన విషయం విదితమే.