Telugu Global
Sports

ఐపీఎల్ -17లో పరుగుకు లక్షలు, వికెట్ కు కోట్లు!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ-20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఒక్కో పరుగు లక్షల విలువ చేస్తుంటే..ఒక్కో వికెట్ కోట్ల విలువకు చేరింది.

ఐపీఎల్ -17లో పరుగుకు లక్షలు, వికెట్ కు కోట్లు!
X

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ-20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఒక్కో పరుగు లక్షల విలువ చేస్తుంటే..ఒక్కో వికెట్ కోట్ల విలువకు చేరింది.

భారత గడ్డపై గత 17సీజన్లుగా జరుగుతూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమ ఐపీఎల్..ఏడాది ఏడాదికీ తన విలువను పెంచుకొంటూ వస్తోంది. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూతో పాటే..క్రికెటర్ల వేలం ధర, ఖరీదైన బ్యాటర్లు సాధించిన పరుగులు, బౌలర్లు పడగొట్టిన వికెట్ల విలువ సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ వస్తోంది.

ప్రస్తుత 2024 సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన మొత్తం 62 లీగ్ మ్యాచ్ ల్లో పలువురు స్టార్ క్రికెటర్లు సాధించిన పరుగులు,వికెట్ల విలువ చూస్తే వారేవ్వా! అనుకోక తప్పదు.

రోహిత్ శర్మ ఒక్కో పరుగు 4 లక్షల 50 వేలు...

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ కమ్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు ఫ్రాంచైజీ చెల్లిస్తున్న మొత్తం 16 కోట్ల రూపాయలు. అయితే..ప్రస్తుత సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 14 మ్యాచ్ ల్లోనూ రోహిత్ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి..ఓ సెంచరీతో సహా 418 పరుగులు సాధించాడు. రోహిత్ సాధించిన ఒక్కో పరుగు విలువను 4 లక్షల 50 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.

స్టార్క్ పడగొట్టిన వికెట్ విలువ 2 కోట్ల 6 వేలు...

2024-ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడు, అత్యధిక వేలం ధర పలికిన మొనగాడు మరెవరో కాదు..ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ మాత్రమే. స్టార్క్ ను కోల్ కతా ఫ్రాంచైజీ వేలం ద్వారా 24 కోట్ల 75 లక్షల రూపాయల రికార్డు ధరకు సొంతం చేసుకొంది.

ఇప్పటి వరకూ ఆడిన మొదటి 13 రౌండ్ల మ్యాచ్ ల్లో స్టార్క్ 12 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ పడగొట్టిన ఒక్కో వికెట్ విలువను 2 కోట్ల 6వేల రూపాయలుగా చెబుతున్నారు.

స్టార్క్ మొదటి 11 మ్యాచ్ ల్లో 209 బంతులు విసిరాడు. స్టార్క్ వేసిన ఒక్కో బంతి విలువ 11 లక్షల 84 వేల రూపాయలుగా ఉంది.

ధోనీ పరుగుకు 8 లక్షల 80వేలు...

చెన్నై ఫ్రాంచైజీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీకి చెల్లిస్తున్న కాంట్రాక్టు మొత్తం సీజన్ కు 12 కోట్ల రూపాయలు. ప్రస్తుత సీజన్ మొదటి 13 మ్యాచ్ ల్లో ధోనీ సాధించిన పరుగులు 136 మాత్రమే. ధోనీ సాధించిన ఒక్కో పరుగు విలువ 8 లక్షల 80వేలుగా నమోదయ్యింది.

లక్నో సూపర్ జెయింట్స్ సారధి కెఎల్ రాహుల్ కు ఫ్రాంచైజీ చెల్లిస్తున్న మొత్తం 17 కోట్ల రూపాయలు కాగా..లీగ్ దశ 14 మ్యాచ్ ల్లో రాహుల్ 500కు పైగా పరుగులు సాధించాడు. రాహుల్ సాధించిన ఒక్కో పరుగు విలువ 8 లక్షల 80వేల రూపాయలు దాటి పోయింది.

ముంబైకి గిట్టుబాటు కాని హార్థిక్ పాండ్యా...

ఐదుసార్లు ఐపీఎల్ విన్నర్ ముంబై ఫ్రాంచైజీ తన స్టార్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి..15 కోట్ల రూపాయల ధరకు కోరి తెచ్చుకొన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పజెప్పింది.

మొత్తం 14 లీగ్ మ్యాచ్ ల్లో ముంబై 10 పరాజయాలు, 4 విజయాలతో 8 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది. కెప్టెన్ హార్థిక్ పాండ్యా మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో 216 పరుగులు మాత్రమే సాధించాడు.

పాండ్యా సాధించిన ఒక్కో పరుగు విలువను 7 లక్షల 50 వేల రూపాయలుగా నిర్ణయించారు.

కమిన్స్ ఒక్కో బంతికి 7 లక్షలు..

మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ వేలం ద్వారా పాట్ కమిన్స్ ను 20 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు దక్కించుకొంది. జట్టు కెప్టెన్ కమ్ ఓపెనింగ్ బౌలర్ గా కమిన్స్ 12 మ్యాచ్ ల్లో 288 బంతులు విసిరి 14 వికెట్లు పడగొట్టాడు.కమిన్స్ వేసిన ఒక్కో బంతి విలువ 7 లక్షల వేయి రూపాయలుగా ఉంది.

కమిన్స్ నాయకత్వంలోనే సన్ రైజర్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోడమే కాదు..ఫోర్లు, సిక్సర్లు బాదుడులోనూ, అత్యధిక టీమ్ స్కోర్లు, భారీ విజయం సాధించడంలోనూ సరికొత్త రికార్డులు నమోదు చేయగలిగింది.

టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్, 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కు ముంబై ఫ్రాంచైజీ 8 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. సూర్య ఆడిన మొత్తం 11 మ్యాచ్ ల్లో 345 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సూర్య సాధించిన ఒక్కో పరుగు విలువ 2 లక్షల 31 వేలుగా తేలింది.

విరాట్ ఒక్కో పరుగుకు 2 లక్షల 26వేలు...

బెంగళూరు ఫ్రాంచైజీకి 15 కోట్ల రూపాయల కాంట్రాక్టు పై ఆడుతున్న స్టార్ ఓపెనర్ విరాట్ కొహ్లీ..మొదటి 13 రౌండ్ల మ్యాచ్ ల్లో 661 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ ను సైతం ఖాయం చేసుకొన్నాడు. విరాట్ సాధించిన ఒక్కో పరుగు విలువ 2 లక్షల 26వేల రూపాయలుగా నిలిచింది.

గుజరాత్ టైటాన్స్ నాయకుడు శుభ్ మన్ గిల్ ధర 7 కోట్ల రూపాయలు మాత్రమే. గిల్ మొదటి 12 రౌండ్ల మ్యాచ్ ల్లో 426 పరుగులు సాధించాడు. ఒక్కో పరుగు విలువ లక్షా 64 వేల రూపాయలుగా ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కాంట్రాక్టు 16 కోట్ల రూపాయలు. రిషభ్ 14 మ్యాచ్ ల్లో 446 పరుగులు సాధించడంతో ఒక్కో పరుగు విలువ 3 లక్షల 50వేల రూపాయలుగా తేలింది.

చెన్నై సూపర్ కింగ్స్ నయా కెప్టెన్ రుతురాజ్ గయక్వాడ్ కు ఫ్రాంచైజీ చెల్లిస్తున్న మొత్తం కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రేమే. రుతురాజ్ 13 మ్యాచ్ ల్లో 583 పరుగులు సాధించడంతో ఒక్కో పరుగు విలువ లక్షా 2వేల రూపాయలుగా తేలింది.

క్రికెట్లో సాధించిన పరుగులు, వికెట్ల విలువను రూపాయలలో చూస్తుంటే..వ్యాపారానికి కాదేదీ అనర్హం అనుకోక తప్పదు మరి.

First Published:  18 May 2024 1:09 PM GMT
Next Story