రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు గప్టిల్ పేర్కొన్నాడు. తన కెరీర్లో మద్దతుగా నిలిచిన కివీస్ క్రికెట్ బోర్డు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు గప్టిల్ థాంక్స్ చెప్పాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన గప్టిల్ 2022 దాకా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 13ఏళ్ల కెరీర్లో మొత్తం 367 మ్యాచ్‌ల్లో గప్టిల్ 13,463 పరుగులు చేశాడు.
అయితే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డ్ గప్టిల్ పేరిటే ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో గప్టిల్ వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో 237 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో 76 హాఫ్ సెంచరీలు, 23 సెంచరీలు చేశాడు. మార్టిన్ గప్టిల్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్, పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కివీస్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గప్తిల్ మాత్రమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.ఈ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) పేరిట ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గప్తిల్‌కు రికార్డు ఉంది.