Telugu Global
Sports

పారా ఒలింపిక్స్ లో భారత' బంగారు' కొండ!

పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ పై పతకాల వర్షం కురుస్తోంది. షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు మూడు పతకాలు దక్కాయి.

పారా ఒలింపిక్స్ లో భారత బంగారు కొండ!
X

పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ పై పతకాల వర్షం కురుస్తోంది. షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు మూడు పతకాలు దక్కాయి.

కొద్దిరోజుల క్రితం ముగిసిన 2024 ఒలింపిక్స్ లో 117 మంది అథ్లెట్ల భారత బృందం సాధించలేనిది....పారిస్ వేదికగానే జరుగుతున్న పారా ( శారీరక వైకల్యం కలిగిన క్రీడాకారుల) ఒలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు సాధించారు. మహిళల షూటింగ్ లో అవని బంగారు పతకం, మోనా కాంస్యం, ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ప్రీతి పాల్ కాంస్య పతకాలు సాధించారు. విలువిద్యలో 17 సంవత్సరాల శీతల్ దేవి రెండు పతకాలు సాధించే అవకాశం ఉంది.

అవని లేఖ్రా అరుదైన ఘనత...

మహిళల 10 మీటర్ల ఏర్ రైఫిల్ ( వీల్ చెయిర్- ఎస్ హెచ్-1 ) విభాగంలో భారత షూటర్లు అవని లేఖ్రా, మోనా అగర్వాల్ స్వర్ణ, కాంస్యాలతో సంచలనం సృష్టించారు.

టోక్యో ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో తొలిసారిగా స్వర్ణం సాధించిన అవని..వరుసగా రెండో ఒలింపిక్స్ లో సైతం బంగారు పతకం సాధించడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పగలిగింది.

పారా ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా రెండు ఒలింపిక్స్ లో స్వర్ణపతకాలు సాధించిన తొలి భారత మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. క్వాలిఫైయింగ్ రౌండ్లలో 625.8 పాయింట్లు సాధించడం ద్వారా మెడల్ రౌండ్ కు అర్హత సంపాదించిన అవని...బంగారు పతకం పోరులో 249. 7 పాయింట్లతో సరికొత్త గేమ్‌సరికార్డుతో విజేతగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన 249. 6 పాయింట్ల రికార్డును ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సవరించగలిగింది.

క్వాలిఫైయింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన ఇర్యానా ..మెడల్ రౌండ్లో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఆఖరి బుల్లెట్ ప్రయోగించడానికి ముందు వరకూ 2వ స్థానంలో కొనసాగుతూ వచ్చిన అవని..10.5 పాయింట్లు సాధించడం ద్వారా అనూహ్యంగా బంగారు పతకం సాధించింది.

మెడల్ రౌండ్ బరిలో నిలిచిన భారత మరో షూటర్ మోనా అగర్వాల్ తన ఆఖరి రౌండ్లో 10 పాయింట్లు సాధించడం ద్వారా కాంస్య పతకం అందుకోగలిగింది.

విధివైపరీత్యాన్ని తట్టుకొని....

11 సంవత్సరాల చిరుప్రాయంలో జరిగిన కారు ప్రమాదంలో అవని ..చాతీ దిగువభాగం నుంచి శరీరభాగాలన్నీ పక్షవాతానికి గురయ్యాయి. అయితే..అవని మాత్రం విధివైపరీత్యాన్ని తట్టుకొని మరీ వీల్ చెయిర్ షూటర్ గా ఎదిగింది. 2021లో టోక్యో వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా అందరి దృష్టీని ఆకర్షించింది.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన అవని..వరుసగా రెండు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు గెలుచుకోడం ద్వారా చరిత్ర సృష్టించింది.

పాదాలే హస్తాలుగా..విలువిద్యలో..

మహిళల విలువిద్య కాంపౌండ్ (రెండు చేతులూ లేని వారి) విభాగంలో 17 సంవత్సరాల భారత ఆర్చర్ శీతల్ దేవి సరికొత్త ప్రపంచ రికార్డుతో రెండోస్థానంలో నిలిచింది.

జమ్మూ కాశ్మీర్ కు చెందిన శీతల్ ..పుట్టుకతోనే రెండు చేతులూ లేకుండా జన్మించింది...తన రెండుపాదాలను ఉపయోగించడం ద్వారా విలువిద్యలో సాధన చేస్తూ వచ్చింది. ఇదే విభాగంలో నలుగురు ప్రత్యర్థులతో పోటీకి దిగిన శీతల్ వ్యక్తిగత ర్యాంకింగ్స్ పోరులో 703 పాయింట్లు సాధించడం ద్వారా మెడల్ రౌండ్ చేరుకోగలిగింది.

అంతేకాదు..మిక్సిడ్ కాంపౌండ్ విభాగంలో రాకేశ్ కుమార్ తో జంటగా పోటీకి దిగిన శీతల్ 1399 పాయింట్లు సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

అత్యంత పిన్నవయసులో పారా ఒలింపిక్‌ విలువిద్యలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆర్చర్ గా శీతల్ చరిత్ర సృష్టించింది.

వ్యక్తిగత, మిక్సిడ్ టీమ్ విభాగాలలో శీతల్ జంట పతకాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహిళల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ప్రీతిపాల్ కాంస్య పతకం సాధించింది. భారత్ తొలిరోజు పోటీలలోనే ఓ స్వర్ణ, రెండు కాంస్యాలతో సహా మొత్తం 3 పతకాలు సంపాదించింది.

First Published:  31 Aug 2024 3:26 PM IST
Next Story