Telugu Global
Sports

భారతక్రికెట్ 'తొలి రికార్డు' హీరోలు!

స్వాతంత్ర్యానికి పూర్వమే 1932లో అధికారికంగా భారత్ ఆడిన తొలిటెస్టు మ్యాచ్ లో నాయకత్వం వహించిన సిక్సర్ల మొనగాడు, కర్నల్ కఠారి కనకయ్యనాయుడు మన తెలుగువాడే కావటం తెలుగుజాతికే గర్వకారణం.

భారతక్రికెట్ తొలి రికార్డు హీరోలు!
X

తొమ్మిది దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో రికార్డుల మొనగాళ్లు ఎందరున్నా... తొలిసారి రికార్డులు నెలకొల్పిన ఘనత మాత్రం అతికొద్దిమందికి మాత్రమే దక్కింది....

భారత్ లో క్రికెట్టే మతం. ఎన్ని రకాల క్రీడలున్నాక్రికెట్ తరువాతే ఏదైనా.1932లో ప్రారంభమైన భారత క్రికెట్ ప్రస్థానం గత 92 సంవత్సరాల కాలంగా అప్రతిహతంగా సాగిపోతోంది.

నిరంతర ప్రవాహంలా సాగిపోతున్న భారత క్రికెట్లో వచ్చే ఆటగాళ్లు వస్తుంటే..పోయే ఆటగాళ్లు పోతూనే ఉన్నారు. అయితే..కలకాలం గుర్తుండిపోయేలా అరుదైన రికార్డులు, అసాధారణ ఘనతలు సాధించినవారు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు.

తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య నాయుడు నుంచి నేటితరం రికార్డుల మొనగాళ్లు ఎందరో మనకు కనిపిస్తారు.

భారత తొలి సారథి సీకె నాయుడు...

స్వాతంత్ర్యానికి పూర్వమే 1932లో అధికారికంగా భారత్ ఆడిన తొలిటెస్టు మ్యాచ్ లో నాయకత్వం వహించిన సిక్సర్ల మొనగాడు, కర్నల్ కఠారి కనకయ్యనాయుడు మన తెలుగువాడే కావటం తెలుగుజాతికే గర్వకారణం.

అయితే..భారత్ తరపున టెస్టు క్రికెట్లో తొలి అర్థశతకం సాధించిన రికార్డు అమర్ సింగ్ పేరుతో ఉంటే..తొలి శతకం బాదిన భారత తొలి క్రికెటర్ గౌరవాన్ని లాలా అమర్ నాథ్ సొంతం చేసుకొన్నారు.

టెస్టు క్రికెట్లో ద్విశతకం సాధించిన భారత క్రికెటర్ గా పాలీ ఉమ్రిగర్ రికార్డుల్లో నిలిచిపోయారు.

తొలివికెట్ హీరో మహ్మద్ నిస్సార్...

టెస్టు క్రికెట్లో భారత్ తరపున తొలి వికెట్ పడగొట్టిన బౌలర్, ఫాస్ట్ బౌలర్ గా మహ్మద్ నిస్సార్ రికార్డు నెలకొల్పారు. 1932లో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మొట్టమొదటి టెస్టుమ్యాచ్ లో నిస్సార్ ఈ ఘనత సాధించారు.

50 ఓవర్ల వన్డే అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున తొలి అర్ధశతకం సాధించిన రికార్డు అజిత్ వడేకర్ పేరుతో ఉంది. అయితే..వన్డేలలో తొలి శతకం సాధించిన గౌరవం మాత్రం ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కు మాత్రమే దక్కుతుంది.

1983 ప్రుడెన్షియల్ ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కపిల్ భారీశతకంతో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..భారత్ కు తొలివన్డే ప్రపంచకప్ ను అందించిన సారథిగా కూడా కపిల్ రికార్డు నెలకొల్పాడు.

వన్డే క్రికెట్లో వికెట్ పడగొట్టిన భారత తొలి బౌలర్ ఘనతను ఏక్ నాథ్ సోల్కర్ సొంతం చేసుకొన్నాడు.

మాస్టర్ సచిన్ పేరుతో తొలి ద్విశతకం రికార్డు...

భారత క్రికెట్ కు రెండుదశాబ్దాలపాటు అనితరసాధ్యమైన సేవలు అందించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నా..వన్డేలలో ద్విశతకం బాదిన తొలి భారత బ్యాటర్ గా సచిన్ చరిత్రలో నిలిచిపోయాడు.

అంతేకాదు..200 టెస్టుమ్యాచ్ లు ఆడి..100 అంతర్జాతీయ శతకాలు సాధించిన భారత ఏకైక, ప్రపంచ తొలి క్రికెటర్ గా కూడా సచిన్ రికార్డు నెలకొల్పాడు.

టీ-20 తొలి శతక హీరో సురేశ్ రైనా...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తొలి అంతర్జాతీయ అర్థశతకం బాదిన మొనగాడుగా రాబిన్ ఊతప్ప, తొలి శతకం సాధించిన బ్యాటర్ గా సురేష్ రైనా, తొలి వికెట్ పడగొట్టిన భారత బౌలర్ గా జహీర్ ఖాన్ రికార్డుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు.

అయితే..సాంప్రదాయ టెస్టు క్రికెట్ లో 125 టెస్టులు, 10వేలకు పైగా పరుగులు సాధించిన తొలి భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ మాత్రమే. ఎందరు ఆటగాళ్లు ఎన్ని రికార్డులు నెలకొల్పినా..తిరగరాసినా..తొలిసారిగా రికార్డులు నెలకొల్పిన క్రికెటర్లు మాత్రం కలకాలం గుర్తుండి పోతారు. భారత క్రికెట్ ఉన్నంతకాలం వారు నెలకొల్పిన తొలి రికార్డులు కలకాలం పదిలంగా ఉంటాయి.

First Published:  28 Aug 2024 10:45 AM IST
Next Story