Telugu Global
Sports

లేటు వయసులో అశ్విన్ ఘాటైన రికార్డు!

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేటు వయసులో ఘాటైన రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచాడు.

లేటు వయసులో అశ్విన్ ఘాటైన రికార్డు!
X

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేటు వయసులో ఘాటైన రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచాడు.

92 సంవత్సరాల భారత టెస్టు చరిత్రలో మరే ఆటగాడు సాధించలేని రికార్డును స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నెలకొల్పాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరి (5వ) టెస్టు ద్వారా అశ్విన్ వందటెస్టుల రికార్డును పూర్తి చేయడంతోనే అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

37 సంవత్సరాల 120 రోజుల వయసులో....

2011లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్ గత 13 సంవత్సరాలుగా భారత టెస్టుజట్టు ప్రధాన ప్లేయర్లలో ఒకడిగా ఉంటూ వచ్చాడు. భారత గడ్డపై జరిగే టెస్టు సిరీస్ ల్లో

అశ్విన్ లేకుండా భారతజట్టు ఉండదన్నమాట ఓ నానుడిగా నిలిచిపోయింది. 2012 తర్వాత నుంచి భారతజట్టు స్వదేశీ సిరీస్ ల్లో వరుసగా 17 విజయాలు సాధించడం వెనుక అశ్విన్ పాత్ర అంతాఇంతా కాదు.

37 సంవత్సరాల 120 రోజుల వయసులో తన వందో టెస్టు ఆడటం ద్వారా లేటు వయసులో శతటెస్టులు ఆడిన దిగ్గజాల వరుసలో అశ్విన్ ఆరవ వాడిగా నిలిచాడు.

తన టెస్టు కెరియర్ లోని వందటెస్టుల్లో అశ్విన్ తొమ్మిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సైతం అందుకొన్నాడు. టెస్టు చరిత్రలోనే లేటు వయసులో నూరుటెస్టులు మైలురాయిని చేరిన దిగ్గజాలలో జెఫ్ బాయ్ కాట్ (40 సంవత్సరాల, 25 రోజుల వయసులో), క్లైవ్ లాయిడ్ (39 సంవత్సరాల, 241రోజులు), గ్రాహం గూచ్ (39 సంవత్సరాల , 190 రోజులు), గార్డన్ గ్రీనిడ్జ్ (38 సంవత్సరాల, 346 రోజులు) , యూనిస్ ఖాన్ (37 సంవత్సరాల, 208 రోజుల )ల తర్వాతి స్థానంలో అశ్విన్ నిలిచాడు.

ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లోని ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకూ అశ్విన్ 100 టెస్టుల్లో 511 వికెట్లు పడగొట్టగలిగాడు. ఇందులో 35సార్లు ఓ టెస్టులో ఐదుకు పైగా వికెట్ల ఘనతను సైతం అశ్విన్ సాధించగలిగాడు.

అశ్విన్ కంటే ముందే వందటెస్టులు ఆడిన భారత దిగ్గజ బ్యాటర్లలో సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్ సర్కార్ (116), కపిల్ దేవ్ (131), సచిన్ టెండుల్కర్ (200), అనీల్ కుంబ్లే (132), రాహుల్ ద్రావిడ్ (164), సౌరవ్ గంగూలీ (113), వీవీఎస్ లక్ష్మణ్ (134), హర్భజన్ సింగ్ (103), వీరేంద్ర సెహ్వాగ్ (104), ఇశాంత్ శర్మ(105), విరాట్ కొహ్లీ (113) , చతేశ్వర్ పూజారా (103) ఉన్నారు.

ఆ ముగ్గురికీ రుణపడి ఉంటా- అశ్విన్...

టెస్టు క్రికెట్లో వంద మ్యాచ్ లు ఆడి, 500కు పైగా వికెట్లు పడగొట్టడం వెనుక తన కృషి మాత్రమే లేదని, పరోక్షంగా ఎందరిదో పాత్ర ఉందని అశ్విన్ చెప్పాడు. తన కుటుంబ సభ్యుల తరువాత కెప్టెన్ రోహి్త శర్మతో పాటు మాజీ కెప్టెన్లు విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, నయావాల్ చతేశ్వర్ పూజారాలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని తెలిపాడు.

తన బౌలింగ్ లో పలు అద్భుతమైన క్యాచ్ లు అందుకోడం ద్వారా రహానే, పూజారా, విరాట్ కొహ్లీ తనకు మేలు చేశారని, వారు పట్టిన క్యాచ్ లు కారణంగానే తన వికెట్ల సంఖ్య 500కు చేరిందని అశ్విన్ వివరించాడు.

అశ్విన్ సాధించిన మొత్తం 511 వికెట్లలో 280కి పైగా వికెట్లు భారతగడ్డపైన సాధించినవే కావడం విశేషం. బ్యాటర్ గా అశ్విన్ కు ఐదు టెస్టు శతకాలు సాధించిన అరుదైన రికార్డు సైతం ఉంది.


First Published:  8 March 2024 12:00 PM GMT
Next Story