అప్పటిదాకా కలిసి ఆడాడు.. అంతలోనే కుప్పకూలాడు
క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఇమ్రాన్ పటేల్
గుండెపోటు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. యవకులను వదలడం లేదు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారనుకునే ప్లేయర్లు దీని బారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు తమతోనే ఆడుతున్న ఆటగాడు విగతజీవిగా మారడంతో సహచరులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కొద్దిసేపటికే ఎడమవైపు ఛాతిలో నొప్పి ఉన్నదంటూ సహచరులకు చెప్పాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన తర్వాత అతను డకౌట్‌గా వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కొద్దిదూరం వెళ్లగానే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు షాక్‌కు గురయ్యారు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండటంతో వీడియోలు బైటికి వచ్చాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం మాత్రం లేదు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తోటి క్రికెటర్ మృతి చెందడంపై సహచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండే ఇమ్రాన్‌కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ ప్రతి మ్యాచ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడని పేర్కొన్నారు. ఇప్పుడు గుండెపోటు మృతి చెందడం షాక్ గురి చేసిందని పేర్కొన్నారు. 'ఇమ్రాన్ మెడికల్ కండీషన్ బాగానే ఉన్నది. గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడలేదు. ఆటపై ప్రేమ ఉన్న ఇలాంటి క్రికెటర్‌ను కోల్పోవడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశం' అని సహచరులు తెలిపారు.
ఇమ్రాన్ పటేల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కొడుకు వయసు నాలుగు నెలలు మాత్రమే. క్రికెట్ ఆడటంతో పాటు రియల్ ఎస్టేట్, జ్యూస్‌షాప్ కూడా నిర్వహిస్తున్నాడు. పుణెలోనే ఇదే ఏడాది సెప్టెంబర్‌లో హబీబ్ షేక్ అనే క్రికెటర్ కూడా క్రికెట్ ఆడుతూ ప్రాణాలు వదిలాడు. అయితే అప్పటికే అతనికి డయాబెటిక్ సమస్య ఉన్నది. కానీ ఇమ్రాన్ పటేల్‌కు మాత్రం అనారోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం.