నాదల్ వారసుడు.. ఆల్ కోర్ట్ స్టార్.. కార్లోస్ అల్కరాస్
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న కార్లోస్ అల్కరాస్ తన ఆరాధ్య ఆటగాడి బాటలోనే నడిచి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు.
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న కార్లోస్ అల్కరాస్ తన ఆరాధ్య ఆటగాడి బాటలోనే నడిచి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. మూడో సీడ్ ఆటగాడైన అల్కరాస్.. తన తర్వాత సీడ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలిచి, టైటిల్ సాధించాడు. ఈ విజయంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
మూడు కోర్టుల్లో గెలిచిన యంగెస్ట్ ప్లేయర్
అతి చిన్న వయసులోనే మూడు కోర్టుల్లో టోర్నీలు గెలిచిన ఆటగాడిగా అల్కరాస్ రికార్డు సృష్టించాడు. 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి, ఈ రికార్డు అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ జిమ్మీ కానర్స్ (22 ఏళ్లు ) పేరిట ఉండేది. 21 ఏళ్లకే మూడు భిన్నమైన కోర్టుల్లో గెలిచిన అల్కరాస్ యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
నాదల్ తర్వాత తనే..
రోలాండ్ గారోస్.. ఎర్రమట్టి దుమ్ము ఎగసిపడే ఈ క్లే కోర్టులో ఫ్రెంచి ఓపెన్ గెలవడం అంటే ఆషామాషీ కాదు. పీట్ సంప్రాస్, ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్ లాంటి దిగ్గజాలకే వణుకు పుట్టించిన ఫ్రెంచి ఓపెన్ వేదికపై రఫెల్ నాదల్ రికార్డులు సృష్టించాడు. 14 టైటిల్స్ గెలిచి, నభూతో అనిపించుకున్నాడు. నాదల్ 19 ఏళ్లకే క్లే కోర్ట్ ఛాంపియన్ అయితే ఇప్పుడు అతని వారసుడిగా చెప్పుకొంటున్న అల్కరాస్ కూడా 21 ఏళ్లకే మట్టికోటకు మహరాజయ్యాడు. నాదల్ తర్వాత ఫ్రెంచి ఓపెన్ గెలిచిన పిన్న వయస్కుడు తనే.