అప్పుడు ఓ సినీ నటితో డేటింగ్‌లో ఉన్నా
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాలపై ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్
యువరాజ్ సింగ్ అనగానే టీమిండియా టీ 20, వరల్డ్ కప్ గెలిచిన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఈ రెండు కప్‌లు గెలవడంలో యువీదే కీలకపాత్ర. ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీ రోల్ పోషించాడు. అతడి పర్సనల్ విషయలూ సంచలనమే. నోటి నుంచి రక్తం వచ్చినా మైదానం నుంచి బైటికి రాకుండా తన పోరాటాన్ని కొనసాగించి తీరుపై భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. క్యాన్సర్ బారిన పడి కోలుకుని బైటపడి కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచాడు. తాజాగా యువరాజ్‌సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తిరమైన విషయాన్ని వెల్లడించాడు. గతంలో తాను ఓ సినీ నటితో డేటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. 2007/08లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలోనే మంకీ గేట్ వివాదం తీవ్రస్థాయిలో బైటపడింది. ఇరుజట్ల మధ్య ఉద్విగ్న వాతావరణ కనిపించింది. ఆ సమయంలోనూ యూవీ డేటింగ్‌తో బిజీగా ఉండటం విశేషం.
గతంలో నేను ఓ సినీ నటితో డేటింగ్ చేశాను. ఆ సమయంలో ఆమె కూడా చాలా ఉన్నతస్థాయిలో ఉన్నది. అడిలైడ్ షూటింగ్ కోసం వచ్చింది. మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. అప్పుడే ఒక మాట చెప్పాను. దయచేసి నువ్వు ఇక్కడికి రావొద్దు. నేను ఆటపై దృష్టి సారించాలి. ఇది ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ అని అన్నాను. కానీ ఆమె మాత్రం మా వెనకే కాన్‌బెర్రాకు వచ్చింది. అప్పటికే నేను మొదటి రెండు టెస్టులో పెద్దగా రన్స్ చేయేలేదు. ఆమెను చూసిన తర్వాత నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అని అడిగాను. నీతో సమయం గడుపుదామని వచ్చానని చెప్పింది. ఆమెతో ఆరోజు ఉండిపోయాను. ఇక నువ్వు నీ కెరీర్‌పై దృష్టి పెట్టు. నేను నా పని మీద ఉంటాను. ఆసీస్ పర్యటన ఎంత కఠినమో తెలిసిందే కదా. ఆ తర్వాత కాన్‌బెర్రా నుంచి అడిలైడ్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యాను. నా సూట్‌కేస్‌ను తనే ప్యాక్ చేసిందని యూవీ చెప్పాడు.
ప్రయాణం చేయాల్సిన రోజు పొద్దున నా షూ ఎక్కడ అని అడిగాను. వాటిని కూడా ప్యాక్ చేసినట్లు చెప్పింది. మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని అడిగితే తన షూ వేసుకొని వెళ్లమని చెప్పింది. అప్పుడు ఆమెకు పింక్ స్లిప్పర్లు ఉన్నాయనుకుంటా. దేవుడా.. నాకెంత కష్టం వచ్చింది అనుకున్నాను. వాటిని వేసుకొని మెళ్లగా బస్సు దగ్గరి వచ్చాను. నా లగేజీ బ్యాగ్‌ను అడ్డంపెట్టుకుని కనిపించకుండా చేశారు. అయితే సహచరులు కొంతమంది చూసి చప్పట్లు కొట్టీ మరీ ఆట పట్టించారు. వేరేవి తీసుకునేదాకా ఆ స్లిప్పర్లతోనే ప్రయాణించానని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సినీ నటి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.