నట్స్‌తో టేస్టీ శ్నాక్స్!

హెల్దీ శ్నాక్స్
నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌తో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి మనకు తెలిసిందే. అయితే వీటిని నేరుగా తినడం కష్టం. అందుకే వీటితో టేస్టీ శ్నాక్స్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.
నట్స్ సలాడ్
బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, కిస్మిస్, చెర్రీస్ వంటివి తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసి వేగించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌ను కలిపితే నట్స్ సలాడ్ రెడీ.
డ్రైఫ్రూట్ లడ్డూ
నెయ్యిలో వేగించిన బాదం, పిస్తా, జీడిపప్పులను మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత అందులో మెత్తగా పేస్ట్ చేసుకున్న ఖర్జూర పండ్లు మిశ్రమాన్ని కలిపి అందులో ఎండుకొబ్బరి పొడి వేసి గుండ్రంగా లడ్డూలు చేసుకోవడమే.
ప్రొటీన్ బార్
బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం పాకం పట్టుకుని అందులో నువ్వులు, నట్స్ ముక్కలను వేసి ఒక ప్లేట్‌లో ఆరబెట్టాలి. మిశ్రమం గట్టి పడ్డాక స్లైస్‌లుగా కట్ చేసుకుంటే ప్రొటీన్ బార్ రెడీ.
ప్రొటీన్ షేక్
ఏవైనా మీకు నచ్చిన రెండు రకాల నట్స్‌ను తీసుకుని వాటిని మెత్తగా పౌడర్ చేసుకుని అందులో ఒక అరటిపండు, కొద్దిగా తేనె వేసి పాలు కలుపుతూ మిక్సీలో గ్రైండ్ చేయాలి. అంతే ప్రొటీన్ షేక్ రెడీ.
కాజు బర్ఫీ
జీడిపప్పుని పొడిగా చేసుకుని అందులో పాలు కలిపి మెత్తని పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో చక్కెర కలిపి తక్కువ వేడి మీద ఉడికించాలి. మిశ్రమం కొద్దిగా గట్టి పడిన తర్వాత యాలకుల పొడి చల్లి ముక్కలుగా కట్ చేసుకుంటే కాజు బర్ఫీ రెడీ.
నట్స్ అండ్ ఓట్స్ మీల్
పాలలో ఓట్స్ కలిపి లోఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఓట్స్‌ మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా తేనె, నెయ్యిలో వేగించిన బాదం, పిస్తా, జీడిపప్పుల ముక్కలను కలుపుకుంటే నట్స్ అండ్ ఓట్స్ మీల్ రెడీ.