Telugu Global
NRI

నియామకాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చే వీల్లేదు

నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం

నియామకాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చే వీల్లేదు
X

ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ మొదలైన తర్వాత ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్‌ తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇవి కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ హ్రిషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ పీఎన్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ మనోశ్‌ మిశ్రా ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కచ్చితంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని బెంచ్‌ పేర్కొన్నది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బంది పెట్టకూడదని వెల్లడించింది. దీంతో 2008లో కె. మంజుశ్రీ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్‌ సమర్థించినట్లైంది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొన్నది.

ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొన్నది. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. ముందస్తుగానే మధ్యలో నిబంధనలు మార్చొచ్చని చెబితేనే.. దానికి అనుగుణంగా చేయవచ్చని వెల్లడించింది. అలాకాకుండా రూల్స్‌ మార్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది.

First Published:  7 Nov 2024 1:49 PM IST
Next Story