తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు.. - పౌర హక్కుల ఉద్యమ కీలక నేతలే టార్గెట్
మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలను ఎన్ఐఏ తనిఖీ చేస్తోంది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్‌గా ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తోంది. నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, అరుణ ఇంట్లో, తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య ఇంటిలో, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇంట్లో ఈ తనిఖీలు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్య కళాశాలలోనూ తనిఖీలు చేసింది. డాక్టర్ టి.రాజారావు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
రాజమహేంద్రవరం వద్ద బొమ్మూరులో పౌరహక్కుల నేత, అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్‌పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య, అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇళ్లలోనూ, సంతమాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధి, గన్నవరంలో అమ్మిసెట్టి రాధా, తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లలోనూ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
వీరిలో ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు, దుడ్డు వెంకట్రావు కుల నిర్మూలన పోరాట సమితి∙నేతగా ఉన్నారు. శ్రీరాములు సలకంచెరువు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా వీరికి మావోయిస్టులతో సంబంధాలపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా హైదరాబాద్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విద్యానగర్‌లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంటిలో, ఆయన బంధుమిత్రుల ఇళ్లలోనూ ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. లాయర్ భవాని ఇంటిపైనా దాడి చేసి తనిఖీలు చేస్తోంది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై వీరి ఇళ్లను జల్లెడపడుతున్నట్టు సమాచారం.