మన్‌కీ బాత్‌లో తెలంగాణ టీచర్ కైలాష్ కృషిని ప్రస్తావించిన ప్రధాని
అంతరిక్షం లేదా ఏఐ అయినా భారత్ భాగస్వామ్యం పెరుగుతున్నదన్న మోడీ

ఏఐ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాంకేతికతను వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు.
ఇస్రో 100 వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికే గర్వకారణమని ప్రధాని కొనియాడారు. అంతరిక్షశాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే దేశ బలమైన సంకాల్పానికి ఇది నిదర్శనమన్నారు. గత పదేళ్లలో సుమారు 460 ఉపగ్రహాలను లాంచ్ చేసినట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రతి సంవత్సరం పురోగతి సాధిస్తున్నామన్నారు. చంద్రయాన్ విజయం దేవానికి ఎంతో గర్వకారణం అన్నారు. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపెడుతున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడమనేది ఇటీవల సాధించిన విజయాల్లో ఒకటన్నారు.
ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనడానికి పారిస్‌కు వెళ్లాను. కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. తాజాగా తెలంగాణ ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని మోడీ అన్నారు. అంతరిక్షం లేదా ఏఐ అయినా భాగస్వామ్యం పెరుగుతున్నదని తెలిపారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపడానికి ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకితం చేస్తామన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం, రాజ్యాంగం రూపకల్పనలో మహిళ పాత్ర గురించి ఆయన కొనియాడారు.