దేశంలో ప్రజలకు ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలపై 16 ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గోవాలో ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందంతో సమావేశమైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఉచితాలు కావాలో, మెరుగైన రోడ్లు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన నీటి సరఫరా కావాలో నిర్ణయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచిత పథకాల పంపిణీకి వినియోగిస్తున్నాయనే అంశంపై స్పందిస్తూ ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికి ఖర్చు చేయాలి.
అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం ఈ సమస్యను ప్రస్తావించగలదే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఖర్చు చేయాలనే అంశాన్ని నియంత్రించలేమన్నారు. ఆయా ప్రభుత్వాలను ఎన్నుకునే బాధ్యత చివరకు ప్రజలదే కాబట్టి, ఉచితాలు కావాలా లేక మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కావాలా అనేది వారే నిర్ణయించుకుంటారని పనగరియా అన్నారు.