రాజకీయ అనుభవం లేదు.. కానీ భయపడను
తమిళగ వెట్రి కళగం పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్
నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదని నటుడు విజయ్ అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయరంగం చాలా సీరియస్ అని పేర్కొన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి మహానాడులో పార్టీ అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతం, భావజాలంతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
కెరీర్ పీక్‌లో వదిలేసి వచ్చా
విజయ్ తమ పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. 'ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ల లాంటివి అన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పనిచేస్తాం. పెరియార్ ఈవీ రామస్వామి, కె. కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక... నేను నా కెరీర్ పీక్‌లో వదిలేసి మీ అందరిపై అంచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడినా. రాజకీయ అనుభవం లేదంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మ విశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లలాంటివాళ్లం' అన్నారు.
పొత్తుల స్పష్టత
బీజేపీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. డీఎంకే ద్రవిడియన్ నమూనాపైనా ధ్వజమెత్తారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పోషిస్తారని తెలిపారు. అరియలూరులో నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తుచేస్తూ.. నీట్‌పై తమ పార్టీ వ్యతిరేక వైఖఱిని ఈ సందర్భంగా ప్రకటించారు. తనను ఆర్టిస్ట్ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. సినిమా కెరీర్‌లో అత్యున్నతస్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడూ నన్ను అవమానించారు. అయినా కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నాను. ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఓటు ఎంతో శక్తిమంతమైనది. మా పార్టీ తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపెడుతుందన్నారు. పొత్తులపై మాట్లాడుతూ.. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజారిటీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామన్నారు.