Telugu Global
National

‘నీట్‌’ రద్దు చేయొద్దు.. - సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు

పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుందని వారు పేర్కొన్నారు. పరీక్ష రద్దు చేయడం విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుందని తెలిపారు.

‘నీట్‌’ రద్దు చేయొద్దు.. - సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
X

‘నీట్‌’ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్‌టీఏను ఆదేశించాలని కోరుతూ 56 మంది నీట్‌ ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్‌–యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నీట్‌ వ్యవహారంపై ఇప్పటివరకు 26 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటిపై జూలై 8న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ర్యాంకర్లు పిటిషన్‌ దాఖలు చేశారు.

పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుందని వారు పేర్కొన్నారు. పరీక్ష రద్దు చేయడం విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుందని తెలిపారు. గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో ఈ మేరకు పిటిషన్‌ వేశారు. నీట్‌–యూజీని రద్దు చేయకుండా ఆదేశాలివ్వడంతో పాటు మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు పాల్పడినవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  5 July 2024 8:00 AM IST
Next Story