ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లో అఖ్నూర్ సెక్టార్‌లో సైనిక అంబులెన్స్‌పై దాడి చేసిన ముగ్గురిని హతమార్చిన భద్రతా సిబ్బంది
జమ్మూకశ్మీర్‌లో అఖ్నూర్ సెక్టార్‌లో సైనిక అంబులెన్స్‌పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. సోమవారం సైన్యం చేపట్టిన భీకర ఆపరేషన్ మంగళవారం కూడా కొనసాగింది. నిన్ననే ఒక ఉగ్రవాదిని అంతం చేసిన దళాలు నేడు మరో ఇద్దరని హతమార్చారు. మరొకరు జోగ్వాన్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్కినట్లుగా సైన్యానికి సమాచారం అందింది. సోమవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.ముగ్గురు ఉగ్రవాదులు అర్ధరాత్రి సమయంలో జమ్మూలోకి చొరబడి ప్రయాణిస్తున్న ఆంబులెన్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆంబులెన్స్‌లోకి 12కు పైగా బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని ఓ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా..ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి పోలీసుల కలిసి ఆపరేషన్ చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.. "అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు జరిగినట్లు సమాచారం లేదు. ఫైరింగ్ జరగడంతో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు " అని ఆర్మీ అధికారులు తెలిపారు.గత వారం బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే.