కువైట్‌లో మళ్లీ క్షమాభిక్ష.. 15వేల మంది తెలుగువారికి విముక్తి!
ఏ దేశమైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారయాత్ర ఇలా ఏ పనికోసం వచ్చేవారికైనా ఆ దేశంలో ఉండటానికి కొన్నాళ్లపాటు వీసా ఇస్తుంది. ఆ గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలి.
వీసా గడువు ముగిసిపోయినా అక్రమంగా ఉంటున్నవారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు కువైట్ ప్రభుత్వం మరోమారు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. మార్చి 18 నుంచి జూన్ 17 వరకు మూడు నెలలపాటు ఇది అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇలా అక్రమంగా నివాసముంటున్నవారు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవడానికి కువైట్‌లో ఉన్న రాయబార కార్యాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకుంటే వెళ్లిపోవడానికి అవకాశం కల్పిస్తారు.
వీసా గడువు ముగిశాక ఉండటం నేరం
ఏ దేశమైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారయాత్ర ఇలా ఏ పనికోసం వచ్చేవారికైనా ఆ దేశంలో ఉండటానికి కొన్నాళ్లపాటు వీసా ఇస్తుంది. ఆ గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలి. లేకుంటే అది అక్రమంగా ఉన్నట్లే. పట్టుబడితే జైళ్లలో పెట్టొచ్చు. లేదా గడువు ముగిసిన వీసాతో వెళ్లేటప్పుడు విమానాశ్రయాల్లో పట్టుకున్నా జైల్లో వేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో ఆయా దేశాలు ఆమ్నెస్టీ ప్రకటించి, ఇలాంటి అక్రమ నివాసితులు వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి అవకాశం ఇస్తాయి.
15వేల మంది తెలుగువారు ఉంటారని అంచనా
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ లాంటి దేశాలకు వెళుతుంటారు. కొంతమంది ఏజెంట్లు టూరిస్ట్ వీసాల మీద వీరిని పంపించేస్తుంటారు. అది తెలిసినా వెనక్కి వెళ్లడానికి డబ్బుల్లేక అక్కడే రహస్యంగా బతుకుతుంటారు. కొందరు వీసా గడువు ముగిసిందని తెలిసినా ఇంటికెళితే ఇన్ని డబ్బులు సంపాదించలేమని అక్కడే ఎలాగోలా బండి నడిపిస్తుంటారు. ఇలాంటి తెలుగువారు కువైట్‌లోనే 15వేల మంది ఉంటారని అంచనా. కరోనా సమయంలో 2020లో క్షమాభిక్ష ప్రకటించినప్పుడు ఇలాగే వేల మంది తిరిగివచ్చారు. ఇప్పుడు కూడా తెలుగువారు వేల మందికి విముక్తి కలగనుంది.