చమరు కంపెనీలు మరోసారి సామాన్యులపై భారం మోపాయి. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 50 పెంచాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో రూ. 1003 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర జూలై 6 నుంచి రూ. 1053కు, హైదరాబాద్‌లో రూ. 1055 ఉన్న ధర రూ. 1105కు చేరింది.
దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల 1న గ్యాస్ ధరలపై మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నెల 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 183.50 తగ్గించాయి. తాజాగా మరో రూ. 8.50 తగ్గించాయి. అదే సమయంలో డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50, 5 కేజీల డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 18 పెంచాయి.
గ్యాస్ ధరల పెంపుపై తెలంగాణ మంత్రి తనదైన శైలిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే కేటీఆర్, గ్యాస్ ధరలపై కూడా సెటైరికల్‌గా స్పందించారు. ‘మంచి రోజులు వచ్చేశాయి. అందరికీ శుభాకాంక్షలు. ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 పెంచారు. భారత కుటుంబాలకు గ్యాస్ ధరలు పెంచి ప్రధాని మోడీ అద్బుతమైన కానుక అందించారు’ అంటూ ట్వీట్ చేశారు.
#AchheDin Aa Gaye Badhai Ho #LPG over ₹1050 An increase again of ₹50
Modi Ji’s Gift to all Indian Households https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022
కేవలం నెల రోజుల వ్యవధిలో గ్యాస్‌కు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త గ్యాస్ కనెక్షన్ల డిపాజిట్నుకూడా పెంచింది. ఈ నెల 16 తర్వాత కొత్త కనెక్షన్ కావాలంటే.. వన్ టైం సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ. 1450 నుంచి రూ. 2500కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక 5 కేజీల సిలిండర్ కోసం గతంలో రూ. 800 ఉన్న డిపాజిట్ రూ. 1150కి పెరిగింది. వీటితో పాటు రెగ్యులేటర్ కోసం గతంలో రూ. 150గా ఉన్నదాన్ని రూ. 250 చెల్లించాల్సి ఉంది.