తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో తెలుగు ప్రజలు సరికొత్త రికార్డ్ సృష్టించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణ జరిగింది. 2021 జరగాల్సిన మహాసభలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. తిరిగి ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత (2023 జూలై 7 నుంచి 9 వరకు) తానా మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలో జరగనున్నాయి. దీనిలో భాగంగా.. నవంబర్ 5న పెన్సిల్వేనియాలోని వార్మిన్ట్సర్ నగరంలో ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్‌లో విరాళాల సేకరణ విందు జరిగింది.
ఈ విందుకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. 45 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో విరాళాల సేకరణ జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విందులో 800 మంది తెలుగు వారు పాల్గొన్నారు. దాదాపు 48 కోట్ల రూపాయలను తెలుగు వారు విరాళంగా ప్రకటించారు. ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటం దీనికి ఒక కారణంగా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. అలాగే ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి ఇంతటి స్పందన రావడానికి మరొక కారణం.. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, వినూత్నమైన కార్యక్రమాలేనని రవి వెల్లడించారు.