టెల్ అవీవ్‌లో మోగిన సైరన్లు.. నిలిచిన విమాన సర్వీసులు
యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు ఉధృతమౌతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ శివారులో ఆ మిలిటెంట్ సంస్థ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కానీ టెల్ అవీవ్‌లో విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. హెజ్‌బొల్లా మంగళవారం టెల్ అవీవ్‌లోని నిరిట్ ప్రాంతంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ క్రమంలో బెన్‌గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే హెజ్‌బొల్లా దాడులకు దిగడం గమనార్హం. మరోవైపు సోమవారం దక్షిణ బీరుట్‌లోని ప్రభుత్వ హాస్పటల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా.. వారిలో ఒక చిన్నారి ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే టార్గెట్
హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాల్లో ఇజ్రాయెల్ ఉన్నది. తమ ఎయిర్‌ఫోర్స్ దళాలు పలుమార్లు హెజ్‌బొల్లా బంకర్ టార్గెట్ చేసి వైమానిక దాడులు చేశాయని రేర్ అడ్మిరల్ డేనియల్ హగారి పేర్కొన్నారు. మిలియన్ల డాలర్ల నగదు, బంగారం ఉన్న ఖజాజాను లక్ష్యంగా చేసుకున్నామని, హెజ్‌బొల్లా ఆ నిధులను ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నదని ఆరోపించారు.
సిన్వర్ వారసుడిపై హమాస్ మల్లగుల్లాలు
ఇజ్రాయెల్ దాడిలో యాహ్యా సిన్వర్ మృతి చెందడంతో కొత్త చీఫ్ ఎంపికపై హమాస్ మల్లగుల్లాలు పడుతున్నది. సిన్వర్ వారసుడిగా ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం కంటే దోహా కేంద్రంగా ఒక కమిటీతో కార్యకలాపాలు నడిపించే యోచనలో ఉన్నామని హమాస్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించేవరకు కొత్త అధ్యక్షుడు లేనట్టేనని వెల్లడించింది. పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా చనిపోయిన తర్వాత ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీనే బృందానికి నాయకత్వం వహిస్తుందని తెలుస్తోంది.