Telugu Global
International

బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా హస్తం.. హసీనా కీలక వ్యాఖ్యలు

అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తానని ఆమె తెలిపారు.

బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా హస్తం.. హసీనా కీలక వ్యాఖ్యలు
X

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, అవామీ లీగ్‌ అధినేత షేక్‌ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. తాను సెయింటు మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్నని ఆమె చెప్పారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని తన దేశ ప్రజలను కోరుతున్నాన ని తెలిపారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదని, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారని హసీనా చెప్పారు.. దానిని తాను అంగీకరించలేదని, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆమె తెలిపారు.

చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్టు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్నారు. భగవంతుని దయ వల్ల త్వరలోనే తిరిగి తన దేశానికి వెళతానని ఆమె చెప్పారు. అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తానని ఆమె తెలిపారు.

బంగ్లాదేశ్‌లో ఆగస్టు 5 నుంచి అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం అవి తీవ్రం కావడంతో ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉన్నారు. యూకేలో ఆశ్రయం కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా ఆ దేశం తిరస్కరించింది. ఈ ఏడాది మే నెలలో హసీనా ఓ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్‌ ఇచ్చిందన్నది దాని సారాంశం. ఆ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది.

ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్యా ఉండేది కాదని, ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుందని, కానీ.. వారి లక్ష్యం అది కాదని ఆమె తెలిపారు. అది ఎక్కడికి వెళుతుందో తనకు తెలుసని చెప్పారు. తాను జాతిపిత బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పానని, నా దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చో.. అప్పగించో అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదని తేల్చిచెప్పినట్టు వెల్లడించారు. ఈస్ట్‌ తైమూరు మాదిరిగా వారు ఇక్కడ కూడా కొత్త దేశం ఏర్పాటు చేస్తారని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌లోని చోటోగ్రామ్, మయన్మార్‌లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటుచేస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్నిఏర్పాటు చేసుకొంటారని నాడు హసీనా పేర్కొన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలవడం గమనార్హం.

First Published:  11 Aug 2024 7:23 PM IST
Next Story