24 మంది మహిళా సిబ్బందిపై హెచ్ఎం అత్యాచారం..! - ఆపై వీడియోల చిత్రీకరణ
ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ వెల్లడించారు.
అతనో ప్రైవేట్ స్కూల్ హెడ్‌మాస్టర్. విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారి పురోభివృద్ధికి దోహదపడాల్సిన వృత్తిలో ఉన్న అతను ఆ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించాడు. తనతో పాటు పాఠశాలలో పనిచేస్తున్న సహోద్యోగినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని ఘాతుకానికి గురైంది ఒకరిద్దరు కాదు.. ఏకంగా 24 మంది మహిళా సిబ్బంది. ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.
పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించి అక్కడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరాచీలో గుల్షన్-ఈ-హదీద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఇర్ఫాన్ గపూర్ మెమూన్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను ఉద్యోగం విషయంలో, ఇతర విషయాల్లో మహిళా సిబ్బందిని భయపెట్టి వారిపై తన ఆఫీస్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఈ దారుణాలను పాఠశాల సీసీ కెమెరాలను ఉపయోగించుకొని రికార్డు చేశాడు.
పట్టుబడిందిలా...
ఈ కీచక హెడ్‌మాస్టర్ అకృత్యాలు అతను చిత్రీకరించిన ఓ వీడియో ద్వారా బయటపడ్డాయి. ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో దర్శనమివ్వడంతో అతని దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం సింధి విద్యాశాఖ మంత్రి రానా హుస్సేన్ దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో.. ఆ పాఠశాలకు అనుమతులే లేవని తేలింది. ఆ ప్రాంత పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో బాధితులు మొత్తం పాఠశాలకు చెందిన మహిళలుగానే గుర్తించామన్నారు. వీడియోలను నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
♦