Telugu Global
International

బ్రిటన్:రిషి సునక్ కు ఎదురు దెబ్బ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి దిశగా కన్జర్వేటివ్ పార్టీ

ఇంగ్లాండ్ అంతటా 230 జిల్లాలలో 8,000 కంటే ఎక్కువ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలలో కన్జర్వేటివ్‌లు పెద్ద ఎత్తున‌ సీట్లను కోల్పోయారు.ఇప్పటి వరకు 65 జిల్లాల్లో ఫలితాలు వెల్లడించగా అందులో లేబర్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకోగా, మరో పక్షమైన‌ లిబరల్ డెమొక్రాట్లు కూడా మంచి ఫలితాలను సాధించారు.

బ్రిటన్:రిషి సునక్ కు ఎదురు దెబ్బ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి దిశగా కన్జర్వేటివ్ పార్టీ
X

బ్రిటన్ లో జాతీయ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల పోరులో రిషి సునక్ దారుణంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, లిబరల్ డెమొక్రాట్‌లు గణనీయమైన విజయాలను సాధిస్తున్నారు.

ఇంగ్లాండ్ అంతటా 230 జిల్లాలలో 8,000 కంటే ఎక్కువ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలలో కన్జర్వేటివ్‌లు పెద్ద ఎత్తున‌ సీట్లను కోల్పోయారు.ఇప్పటి వరకు 65 జిల్లాల్లో ఫలితాలు వెల్లడించగా అందులో లేబర్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకోగా, మరో పక్షమైన‌ లిబరల్ డెమొక్రాట్లు కూడా మంచి ఫలితాలను సాధించారు. కన్జర్వేటివ్ లు తమ చేతుల్లో ఉన్న 250 స్థానాలను కోల్పోయారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఇప్పటికే 10 జిల్లాల్లో పట్టు కోల్పోయింది.ఈ ఫలితాలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని కన్జర్వేటివ్‌లు అంగీకరించారు.

లేబర్ పార్టీ లీడర్ కైర్ స్టార్మర్ మాట్లాడుతూ, "వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మేము మెజారిటీ సాధిస్తామనడానికి ఇదే గుర్తు అన్నారు." ''టోరీల వైఫల్యానికి ప్రజలు తగిన శిక్ష వేశారు. వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది'' అని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాక చాలా మంది ఓటర్లు మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని ఫలితాలు నిరూపించాయని లేబర్ పార్టీ పేర్కొంది.

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆధ్వర్యంలో కన్జర్వేటివ్‌ పార్టీలో జరిగిన‌ గందరగోళానికి ఓటర్లు వారిని శిక్షించేలా కనిపిస్తోందని రాజకీయ విశేషకులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా బోరిస్ అనేక కుంభకోణాల మధ్య రాజీనామా చేయడం తర్వాత అతని స్థానంలో నియమితులైన లిజ్ ట్రస్ పన్ను-తగ్గింపు ప్రణాళికలు ఆర్థిక మార్కెట్లను భయపెట్టాయి, పౌండ్ విలువను దెబ్బతీశాయి. UK ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దాంతో ఆరు వారాల్లో ట్రస్ కూడా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ అతర్వాత రిషు సునక్ ప్రధాని అయ్యారు. ఈ అస్థిరత్వం కారణంగా ప్రజలు కన్జర్వేటివ్ లను వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.

కాగా, స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

First Published:  5 May 2023 4:12 PM GMT
Next Story