Telugu Global
International

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నిందా? – అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అదే..

అమెరికా మాజీ అధ్య‌క్షుడికి పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి తెలిపారు.

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నిందా? – అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అదే..
X

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌ కుట్ర పన్నిందా? ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన రిపోర్ట్‌ మాత్రం అదేనని తెలుస్తోంది. దీంతో ఆయనకు సీక్రెట్‌ సర్వీస్‌ వెంటనే భద్రత పెంచింది. అయితే ట్రంప్‌పై శనివారం పెన్సిల్వేనియాలో హత్యాయత్నం జరగడానికి కొన్ని వారాల క్రితమే ఇదంతా జరగడం గమనార్హం. మరి ఈ హత్యాయత్నానికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడికి ఇరాన్‌ కుట్రతో సంబంధముందా అనేది ఆరా తీసిన అధికారులు.. అతనికి ఇరాన్‌ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరించారు.

ట్రంప్‌ అధికారంలో ఉండగా.. ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖాసిం సులేమానీని డ్రోన్‌ దాడిలో అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌కి ఇరాన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అమెరికా మాజీ అధ్య‌క్షుడికి పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి తెలిపారు. అందుకు అనుగుణంగా భద్రతా వనరులను సర్దుబాటు చేస్తున్నామని వివరించారు.

ట్రంప్‌ సహా ఆయన అధికారంలో ఉన్న సమయంలోని పాలకులకు ఇరాన్‌ నుంచి ఉన్న ముప్పుపై అమెరికా భద్రతా అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్‌ వాట్సన్‌ వెల్లడించారు. మరోపక్క ఈ వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్‌ మిషన్‌ తీవ్రంగా ఖండించింది. నిరాధార, దురుద్దేశపూరిత ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ట్రంప్‌ ఒక నేరస్తుడని, ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

First Published:  17 July 2024 3:44 AM GMT
Next Story