నిరుపేద మైనార్టీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2015 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మైనార్టీల వివాహాలకు ప్రభుత్వం 50 వేల రూపాయల సహాయం చేసేది.
అయితే ఎన్నికల సమయంలో దుల్హన్ పథకాన్ని కొనసాగించడమే కాక 50 వేలకు బదులు లక్షరూపాయలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆ పథకాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో ఈ పిటిషన్ పై గతంలో ఒక సారి విచారణ జరగగా మళ్ళీ ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ ను విచారించింది. గత విచారణలో దుల్హన్ పథకాన్ని ఆపేశామని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అదే విషయాన్ని ఈ రోజు హైకోర్టు ప్రశ్నించింది.
దుల్హన్ పథకాన్ని ఆపేశామని చెప్పారు కదా… అందుకు గల కారణాలేమిటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. అయితే ఆ వివరాలు ఇవ్వడానికి తమకు 4 వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేయగా అంగీకరించిన కోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.