Telugu Global
NEWS

ఈ నెలలో ఇవి మర్చిపోకండి!

రెండు వేల నోట్ల మార్పిడి, ఉచితంగా ఆధార్ అప్‌డేట్ వంటి చాలా పనులకు ఈ నెలలోనే డెడ్‌లైన్ ఉంది. వీటితో పాటు ఈ నెలలో మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయి.

ఈ నెలలో ఇవి మర్చిపోకండి!
X

రెండు వేల నోట్ల మార్పిడి, ఉచితంగా ఆధార్ అప్‌డేట్ వంటి చాలా పనులకు ఈ నెలలోనే డెడ్‌లైన్ ఉంది. వీటితో పాటు ఈ నెలలో మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే..

రెండు వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నోట్ల మార్పిడికి గడువు ఈ నెల 30తో ముగియనుంది. కాబట్టి ఈ నెలాఖరులోగా రెండు వేల నోట్లను బ్యాంక్‌కు వెళ్లి డిపాజిట్ చేసుకోవడం మర్చిపోవద్దు.

మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్‌ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవాళ్లు నామినిని జత చేసుకోవడానికి కూడా సెప్టెంబరు 30 వరకే గడువు. గతంలో మ్యూచువల్ ఫండ్స్‌కు నామిని ఆప్షన్ లేదు. అయితే సంస్థలు ఇప్పుడు నామిని ఫీచర్‌‌ను యాడ్ చేశాయి. ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్‌ ఫండ్స్‌కు నామిని ఉండాలో వద్దో నిర్ణయించుకుని ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. దానికి సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంది. నామిని విషయాన్ని కన్ఫర్మ్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

పోస్ట్ ఆఫీసులో ఖాతాలు ఉన్నవాళ్లు ఈ నెల 30వ తేదీలోగా ఆధార్ వివరాలు ఇచ్చి అకౌంట్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ఇప్పటి వరకు ఆధార్‌ను లింక్ చేయనివాళ్లు ఈ నెలలోగా ఆ పని పూర్తి చేయాలి. అలాగే పోస్ట్ ఆఫీస్ ఖాతాలో ఉన్న డిపాజిట్‌ మొత్తం రూ.50 వేలు దాటితే పాన్‌ కార్డు వివరాలు కూడా జత చేయాల్సి ఉంటుంది.

ఇక చివరిగా ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కూడా ఈ నెలలోనే డెడ్‌లైన్ ఉంది. ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రెస్ వంటివి మార్చుకోవాలనుకునేవాళ్లు సెప్టెంబరు 14లోగా ఉచితంగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత మార్చుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.


First Published:  6 Sept 2023 4:39 PM IST
Next Story