ఎట్ హోమ్.. ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన గవర్నర్ విందు
ఈసారి జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ఆసక్తికరమైన కలయికల కోసం ఎదురు చూస్తుండటమే కారణం.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు సంప్రదాయంగా 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత కొన్నాళ్లుగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో జరుపుతున్నారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది ఎట్ హోమ్‌ను నిర్వహించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం యధావిధిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈసారి జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ఆసక్తికరమైన కలయికల కోసం ఎదురు చూస్తుండటమే కారణం.
విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపథం చేసిన చంద్రబాబు గత కొన్నాళ్లుగా సీఎం జగన్‌కు ఎదురు పడలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా కూడా చంద్రబాబు ఓటేసి వెళ్లిపోయారు. అక్కడ ఎవరని కలవలేదు. అయితే సోమవారం సాయంత్రం జరిగిన 'ఎట్ హోమ్'లో ఇద్దరు నేతలు పాల్గొన్నా.. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు.
ఇక హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏకంగా గవర్నర్ తమిళిసై బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తమిళిసై కూడా తనకు గవర్నర్‌గా సరైన ప్రొటోకాల్ లభించడం లేదని ఏకంగా సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది కరోనా కారణంగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే 'ఎట్ హోమ్' కార్యక్రమాలు నిర్వహించలేదు. ఉగాది వేడుకలు నిర్వహించినా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు కూడా సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కొన్నాళ్ల క్రితం తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా భుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాత్రం కేసీఆర్ పాల్గొన్నారు.
అయితే ఈ సారి 'ఎట్ హోమ్' కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ తన రాజ్‌భవన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, జడ్జీలు మాత్రమే పాల్గొన్నారు. అయితే సీఎం ఎందుకు పాల్గొనలేదనే విషయంపై మాత్రం ఇంకా సీఎంవో ఎలాంటి ప్రకటన చేయలేదు.