సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం, పొగాకు నమలడం వంటి పొగాకు సంబంధిత వ్యసనాల వల్ల దేశంలో ప్రతిఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. పొగాకు వినియోగం దురలవాటని, దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిసినా అనేక మంది ఆ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకి సహాయం చెయ్యడం కోసం సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై క్విట్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్లను కేంద్ర ప్రభుత్వం ప్రచురిస్తోంది.
ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై క్విట్‌లైన్ నంబర్లు ప్రచురిస్తోండగా, ఆసియాలో కేవలం మలేషియా, సింగపూర్, థాయ్ ల్యాండ్లు మాత్రమే ఈ చర్య తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో ఆ దేశాల సరసన భారత్ చేరింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తయారయ్యే అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై 1800-11-2356 అనే నంబరును ప్రచురిస్తున్నారు.
పొగాకు వ్యసనం వదిలించుకోవాలనుకునేవాళ్లు ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే అవసరమైన కౌన్సిలింగ్ సహాయం అందుతుంది. అలాగే వారికి సమీపంలోని డీఅడిక్షన్ సెంటర్ల అడ్రస్‌లు కూడా ఇస్తారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఈ హెల్ప్‌లైన్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పటికే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఫొటోలతో కూడిన ఆరోగ్య హెచ్చరికలను ప్రచురిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్నాయి. కెనడా క్యాన్సర్ సొసైటీ ఫొటోలతో కూడిన హెచ్చరికలపై ఇటీవల విడుదల చేసిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత్‌కి ఐదవ స్థానం వచ్చింది.
మొదటి స్థానంలో ఉన్న తూర్పు తైమూర్ సిగరెట్ ప్యాకెట్లపై 92.5 శాతం స్థలంలో ఆరోగ్య హెచ్చరికలు ప్రచురిస్తోండగా, మన దేశం 85 శాతం స్థలంలో ఆ హెచ్చరికలను ప్రచురిస్తోంది. భారీ సంఖ్యలో నిరక్షరాస్యులు, అనేక భాషలు ఉన్న మన దేశంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పొగాకు దుష్ఫలితాలను అర్థమయ్యేట్లు చెప్పడంలో ఈ హెచ్చరికలు సఫలీకృతమయ్యాయని పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న వాలంటరీ హెల్త్ అసోసియేషన్‌కి చెందిన బినోయ్ మాథ్యూ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరిపిన గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే 2016-17 ఈ విషయాన్ని నిర్థారించిందని ఆయన తెలిపారు. పొగాకు ఉత్పత్తులపై ఫోటో హెచ్చరికలను చూశాక తమ అలవాటు మానుకోవాలని లేదా కనీసం తగ్గించుకోవాలని సిగరెట్ తాగేవాళ్లలో 62 శాతం మంది, బీడీ తాగే వాళ్లలో 54 శాతం మంది భావించారని ఆ సర్వే వెల్లడించింది.
మొత్తంగా పొగాకు వాడకం ప్రమాదకరమని పొగాకు వాడే వాళ్ళలో 96 శాతం మంది అంగీకరించారని ఆ సర్వే తెలిపింది. ఈ ప్రచారం వల్ల ధూమపానం చేసేవాళ్లలో 55 శాతం మంది, పొగాకు నమిలే వాళ్లలో 50 శాతం మంది తమ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది.
ఈ ట్రెండ్ వల్ల ప్రస్తుతం పొగాకు వ్యసనాన్ని తగ్గించే డీఅడిక్షన్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని, సిగరెట్, బీడీ ప్యాకెట్లపై క్విట్‌లైన్ నంబర్ని ప్రచురించడం వల్ల పొగాకు బాధితులకు మరింత సహాయం అందుతుందని బినోయ్ మాథ్యూ వెల్లడించారు.