Telugu Global
Editor's Choice

ఎక్కే విమానం.. దిగే విమానం!

నేడు 36వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

ఎక్కే విమానం.. దిగే విమానం!
X

ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. మళ్లీ గాలిమోటర్‌ ఎక్కి పోయి రావలే హస్తినకు అంటున్నారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయి 15 నెలలు కావస్తోంది. ఈ 15 నెలల్లో ఆయన ఫ్లైట్‌ మోడ్‌లోనే ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టుగానే ఆయన పరిపాలన సాగుతోంది. మంగళవారం సాయంత్రం ఆయన మరోసారి హస్తినకు పయనమవుతున్నారు. పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి చర్చించేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ ఎన్నికలపై చర్చించేందుకే రేవంత్‌ హస్తిన బాట అంటున్నారు. 2023 డిసెంబర్‌ 7న రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 11 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కేబినెట్‌లో మొత్తం బెర్త్‌ లు 18 కాగా ఇంకో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశమున్నది. 15 నెలలుగా కేబినెట్‌ విస్తరణకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. ఈ 15 నెలల్లో ఎప్పుడో ఒకసారి తప్ప కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి టేకాఫ్‌.. ల్యాండింగ్‌లతో బిజీ బిజీగా ఉంటున్నారు.

రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లో రాహుల్‌ గాంధీతో టర్మ్స్‌ బాగానే ఉండేవని.. తాను వద్దని వారించినా వినకుండా హైడ్రా పేరుతో సాగించిన విధ్వంసంతోనే తెలంగాణ ముఖ్యమంత్రికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం సోనియాగాంధీ నివాసంలో రేవంత్‌ ను రాహుల్‌ గాంధీని కలిసి అక్కడా వన్‌ సైడ్‌ బ్యాటింగ్‌ మాత్రమే జరిగిందని చెప్తున్నారు. నెలల విరామం తర్వాత పార్టీ అగ్రనేత అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో ఏదేదో చెప్పేద్దామని ఆత్రుత పడ్డ రేవంత్‌ రెడ్డికి వన్‌ సైడ్‌ బ్యాటింగ్‌తో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్టుగా గాంధీ భవన్‌ వర్గాలే చెప్తున్నాయి. రాహుల్‌తో మీటింగ్‌ కు సంబంధించిన ఒక్కటంటే ఒక్కఫొటో కూడా రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా, రేవంత్‌ సొంత టీమ్‌ బయట పెట్టలేదు. అంటే రాహుల్‌ గాంధీ కనీసం ఫొటో దిగేందుకు కూడా అవకాశం ఇవ్వలేదా? అదే నిజమైతే రేవంత్‌ రెడ్డికి పార్టీ పెద్దల దగ్గర ఉన్న విలువ ఏపాటిదో తేలిపోతుంది. రేవంత్‌ చర్యలతో కాంగ్రెస్‌ పార్టీ ఇమేజీ దెబ్బ తింటుందని.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతోనే ముఖ్యమంత్రి పీఠంపై రేవంత్‌ కొనసాగుతున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆఫ్‌ ది రికార్డుగా చెప్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఓ కన్నేసి ఉంచిందని సమాచారం. కర్నాటక తర్వాత ఆర్థికంగా పార్టీకి చేయూతనిచ్చే రాష్ట్రం కూడా తెలంగాణానే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విషయంలో పార్టీ హైకమాండ్‌ ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్తున్నారు. రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఆయన టీమ్‌ కేబినెట్‌ విస్తరణతో పాటు పీసీసీ కమిటీలపై హైకమాండ్‌ అనుమతి ఇస్తుందని మీడియాకు లీకులు ఇవ్వడం.. ప్రతిసారి రేవంత్‌ వట్టి చేతులతో తిరిగి రావడం పరిపాటిగా మారింది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న తెలంగాణలోనే ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను అమలు చేయలేని పరిస్థితి. పరిపాలనపై రేవంత్‌ కు పట్టు లేకపోవడం.. హైడ్రా పేరుతో ప్రజల ఇండ్లను కూల్చేయడం.. మూసీ ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతి చేయబోతున్నట్టుగా స్వయంగా రేవంత్‌ రెడ్డినే ఇండికేషన్స్‌ ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఇంత అనే భావన ప్రజల్లో పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్‌ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రైతు భరోసా వానాకాలం సీజన్‌ కు పూర్తిగా ఎగవేయడం.. పంటలు సాగుచేసిన రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రిని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఈ విషయాలన్నీ రాహుల్‌ గాంధీ ఇంటర్నల్‌ టీమ్‌ పూసగుచ్చినట్టు ఢిల్లీ పెద్దలకు ఎప్పటికప్పుడు చేరవేస్తోంది.

రాహుల్‌ దూతగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ ఇప్పటికే యాక్షన్‌లోకి దిగిపోయారు. ఈక్రమంలోనే రేవంత్‌ ను ఢిల్లీకి రావాలని పార్టీ హైకమాండ్‌ కబురు పంపింది. 15 నెలల కాంగ్రెస్‌ పాలన డిజాస్టర్స్‌ పై రేవంత్‌ ను పార్టీ హైకమాండ్‌ నిలదీసే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై దిశానిర్దేశం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు రెండు వారాల సమయంలో ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై మరికొన్ని రోజుల తర్వాతే క్లారిటీ రావొచ్చని చెప్తున్నారు. రేవంత్‌ తీరుతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కాంగ్రెస్‌ పార్టీ మెడ మీదకు వచ్చిందని.. ఒకవేళ సుప్రీం కోర్టు జోక్యంతో ఉప ఎన్నికలు వస్తే దానికి రేవంత్‌ రెడ్డినే బాధ్యత వహించాలని కూడా హైకమాండ్‌ తేల్చిచెప్పే అవకాశముందని సమాచారం. అస్తవ్యస్తంగా మారిన కులగణన, ఎస్సీ వర్గీకరణను సరిచేయాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి విషయంలో ఇకపై పార్టీ హైకమాండ్‌ కఠినంగానే ఉంటుందని.. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించదని కూడా సమాచారం. ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇకనుంచి ఒకలెక్క అన్నట్టుగా రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలు.. హైకమాండ్‌ పెద్దలతో సమావేశాలు ఉండబోతున్నాయని గాంధీ భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. అంటే రానున్న రోజుల్లో రేవంత్‌ ఏ చిన్న పని చేయాలన్నా గాలిమోటర్‌ ఎక్కి హస్తిన పోయి రావాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.

First Published:  25 Feb 2025 3:02 PM IST
Next Story