Telugu Global
Editor's Choice

అయినను.. పోయిరావలె హెలీక్యాప్టర్‌ లోనే!

ముఖ్యమంత్రి గర్రు గుర్రు అంటున్నా హెలీక్యాప్టర్‌ దిగేది లేదంటున్న మంత్రులు

అయినను.. పోయిరావలె హెలీక్యాప్టర్‌ లోనే!
X

ముఖ్యమంత్రి.. మంత్రుల మధ్య హెలీక్యాప్టర్‌ పంచాయితీ పీక్స్‌ చేరింది. రెండు, మూడు గంటలు కారులో వెళ్తే చేరుకునే దూరానికి కూడా మంత్రులు హెలీక్యాప్టర్‌ ఉపయోగించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి గర్రుగుర్రులాడుతున్నారు. మంత్రుల టూర్లకు హెలీక్యాప్టర్‌ ఇవ్వకుండా కట్టడి చేయాలని.. ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌ కు కఠినమైన డైరెక్షన్స్‌ ఇవ్వాలని సీఎస్‌ కు ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఫైర్‌ అవడంతో సీఎస్‌ శాంతి కుమారి అమాత్యులకు ఇదే విషయం చెప్పి చూశారు. కానీ మంత్రులు తగ్గేదే లేదంటున్నారు.. బై రోడ్‌ రెండు, మూడు గంటల జర్నీ అయినా హెలీక్యాప్టర్‌ లోనే పోయి రావలె అంటున్నారు. నల్గొండ మంత్రులకు ఖమ్మం అమాత్యులు తోడై తనను క్షోభకు గురి చేస్తున్నారనేది ప్రభుత్వ పెద్దల ఆవేదన. నయాన్నో.. భయాన్నో చెప్పి చూసినా.. బాహాటంగానే ఆగ్రహం వెళ్లగక్కినా ప్రయోజనం లేదే అని వాపోవడం ఇప్పుడు పెద్దల వంతయ్యింది. హెలీక్యాప్టర్‌ పంచాయితీ లీక్‌ అయ్యాక ఆ రెండు జిల్లాల మంత్రులు ఇక తగ్గేదే లేదని అంటున్నారు. సీఎం, మంత్రుల మధ్య అధికారులు నలిగిపోతున్నారు.

హైడ్రాకు విశేషాధికారాలు కట్టబెట్టడంతో పాటు పలు కీలక అంశాలపై శుక్రవారం కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌ లో కేబినెట్‌ భేటీ జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయమే నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టూర్‌ కు వెళ్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ ప్రాజెక్టు పరిశీలనకు కోమటిరెడ్డి వెంట తీసుకెళ్తున్నారు. వేగంగా ప్రాజెక్టు పరిశీలన పూర్తి చేసి ఇరిగేషన్‌ అధికారులు, ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ (కరెంట్‌) ఇష్యూస్‌ పైనా సమీక్షిస్తారు. అక్కడే లంచ్‌ చేసి మళ్లీ హెలీక్యాప్టర్‌ ఎక్కి హైదరాబాద్‌ కు తిరిగి వచ్చేస్తారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి సెక్రటేరియట్‌ కు చేరుకొని కేబినెట్‌ మీటింగ్‌ లో పాల్గొంటారు. కేబినెట్‌ మీటింగ్‌ ఉంది కాబట్టి మంత్రులు హెలీక్యాప్టర్‌ లో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లట్లేదు. సీఎం రేవంత్‌ రెడ్డి తమను హెలీ క్యాప్టర్‌ ఉపయోగించొద్దు అన్నారు కాబట్టే పట్టుబట్టి మరీ హెలీక్యాప్టర్‌ లోనే ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా హెలీ క్యాప్టర్‌ దిగేది లేదని మంత్రులు గట్టిగానే చెప్తున్నారు.

First Published:  20 Sep 2024 1:03 AM GMT
Next Story