Telugu Global
Editor's Choice

వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నామనే భావనలో చాలామంది అధికారపార్టీ నేతలు

వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా సొంతపార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ఆయన చుట్టూ భజనపరులు చేరారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలు క్రమంగా పెరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చి 14 నెలలుగా దాటినా క్యాబినెట్ విస్తరణ పూర్తి కాలేదు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ నెరవేరలేదు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నియామకమై 5 నెలలు పూర్తయినా కార్యవర్గం కూర్పు పూర్తికాలేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరుత్సాహమే మిగిలింది. కులగణనపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతున్నది. రెడ్డి సామాజికవర్గ నేతలు బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. సీఎం సామాజికవర్గనేతలకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా వారికే పిలిచి పదవులు కట్టబెడుతున్నారని కానీ బీసీ నేతలను, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని బాహాటంగానే పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికైనా కులగణన నివేదిక ప్రకారం సామాజికవర్గాల వారీగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా అన్నిరంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా, మండలాల నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు తారాస్థాయికి చేరాయి. కొన్నిచోట్ల సొంతపార్టీ నేతల మధ్యే పంచాయితీ నడుస్తున్నది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల రాకను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో వారినే మాపై రద్దుతున్నారని మండిపడుతున్నారు. అందుకే అక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉప్పు.. నిప్పులా ఉంటున్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై, రైతు భరోసాపై సొంతపార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు. ఇవి సంపూర్ణంగా అమలుచేయకపోవడం వల్ల తాము గ్రామాల్లో తిరగలేకపోతున్నామని వాపోతున్నారు. దీనికితోడు ఎమ్మెల్మేలు, మంత్రుల మధ్య దూరం పెరిగిపోయింది. మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. పది మంది ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో సమావేశమై ప్రజాప్రతినిధులను తగిన రీతలో గౌరవించడం లేదని కొంతమంది మంత్రుల తీరును తప్పుపట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కలవరపడిన పార్టీ హైకమాండ్‌ ఆదేశాల మేరకు సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డామని, ఇప్పటికైనా మా బతుకులు బాగుపడుతాయని భావించిన మాకు అన్యాయం జరుగుతున్నదని చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టులు, మార్కెట్‌ యార్డులు, దేవాదాయ శాఖ, కోఆపరేటివ్‌, గ్రంథాల పదవులు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేకపోవడంపై తమకు అన్యాయం జరుగుతున్నదని మండిపడుతున్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కులగణన నివేదికను తప్పులతడక అన్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా నాయకత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నది. ఆయనకు నోటీసులు జారీచేస్తే దానికి స్పందించకపోగా మరింత రెచ్చిపోతున్నారనే అభిప్రాయం పార్టీలో ఉన్నది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కూడా పార్టీ నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాలకు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ను సూచించే అర్హత మాకు లేదా అని వ్యాఖ్యానించారు. పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా? పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటివద్ద కావలికారుల్లాగా పని చేస్తున్నారు. ఆయన కేసు పెట్టమంటే పెడుతున్నారు.. వద్దంటే తీసేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 28న విస్తృతస్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ రానున్నారు. ఆమెకు పార్టీలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

First Published:  26 Feb 2025 2:18 PM IST
Next Story